Uttam Kumar reddy: అధికారులు ఎట్టిపరిస్థితుల్లో దరఖాస్తులను తిరస్కరించకూడదు: మంత్రి ఉత్తమ్‌

ఆరు గ్యారంటీలపై హామీ ఇచ్చి ఎన్నికలకు వెళ్లామని.. వాటిని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలన్న లక్ష్యంతోనే ప్రజాపాలన నిర్వహిస్తున్నామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు.

Updated : 27 Dec 2023 16:09 IST

కరీంనగర్‌: ఆరు గ్యారంటీలపై హామీ ఇచ్చి ఎన్నికలకు వెళ్లామని.. వాటిని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలన్న లక్ష్యంతోనే ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికారులకు ప్రజాపాలనపై నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు. మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, నాలుగు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఈ నెల 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామ పంచాయతీల్లో దరఖాస్తులు స్వీకరిస్తాం. కొత్త రేషన్ కార్డుల జారీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రేషన్ కార్డులు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. పారదర్శకంగా విధులు నిర్వర్తించాలి. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులన్నీ స్వీకరించాలి.. ఎట్టి పరిస్థితుల్లో తిరస్కరించ వద్దు. లబ్ధిదారుల అర్హత అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన ప్రభుత్వం ఇది. వారి ఆశయాలకు అనుగుణంగా అధికారులు పని చేయాలి.

ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ఆరోగ్యశ్రీలో భాగంగా వైద్య ఖర్చులను రూ.10 లక్షలకు పెంచాం. మరో నాలుగు గ్యారంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. దరఖాస్తుల స్వీకరణ మొక్కుబడిగా కాకుండా అధికారుల్లోనూ మార్పు వచ్చిందని ప్రజలు భావించేలా ఉండాలి. దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా పోలీసులు ప్రజలతో ఫ్రెండ్లీగా వ్యవహరించాలి. స్వీకరణ ప్రక్రియలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే దళారులు తయారు అవుతారు. పదేళ్ల తర్వాత అవకాశం వచ్చిన దృష్ట్యా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది’’ అని ఉత్తమ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని