Lok sabha elections: వివాదాలున్నా, కేసుల్లో ఇరుక్కున్నా.. విజయం దిశగా..!

ఎన్నికల సమయంలో పలు కేసులు, వివాదాలతో వార్తల్లో నిలిచిన కొందరు అభ్యర్థులు కౌంటింగ్ వేళలో ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. 

Updated : 04 Jun 2024 13:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సార్వత్రిక ఎన్నికల భేరి మోగక ముందునుంచి, ఎన్నికలు జరిగిన సమయంలో దేశవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు తీవ్ర వివాదాల్లో చిక్కుకున్నారు. కొందరిని పలు కేసులు వెంటాడాయి. అసలు పార్టీలు తమకు టికెట్ ఇస్తాయో, లేదో..? అన్న పరిస్థితి ఎదుర్కొన్నవారున్నారు. అలాంటివారు టికెట్ దక్కించుకొని, విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఆ స్థానాలు, అభ్యర్థులు ఎవరో చూద్దామా..?(lok sabha elections 2024)

  • హాసన: పలువురు మహిళలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తన సిటింగ్ నియోజకవర్గంలో లీడింగ్‌లో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఆ కేసు.. కర్ణాటక రాజకీయాలను కుదిపేసింది. అయితే హాసనలో ఓటింగ్‌ పూర్తయిన తర్వాత అభ్యంతరకర వీడియోల వ్యవహారం వైరల్‌ అయింది. అందుకే ఓటర్ల నిర్ణయంపై ఆ కేసు ప్రభావం చూపకపోయుండొచ్చని తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి శ్రేయస్‌ పాటిల్‌ పోటీపడ్డారు.
  • ఖదూర్ సాహెబ్: ఏడాది క్రితం పంజాబ్‌లో వేర్పాటువాదాన్ని తెరపైకి తెచ్చి కలకలం రేపిన ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్‌ సింగ్‌ (Amritpal Singh) పంజాబ్‌లోని ఖదూర్ సాహెబ్ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నాడు. కౌంటింగ్ వేళ..అతడు ఆధిక్యంలో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం అతడు డిబ్రూగఢ్‌ జైల్లో ఉన్నాడు. కాంగ్రెస్ నుంచి అభ్యర్థి కుల్బీర్ సింగ్ జిరా పోటీపడిన సంగతి తెలిసిందే.
  • కృష్ణానగర్‌: పశ్చిమబెంగాలోని కృష్ణానగర్ లోక్‌సభ నియోజకవర్గంలో టీఎంసీ అభ్యర్థి మహువా మొయిత్రా.. రాజమాత అమృతారాయ్‌పై ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారంటూ ఆరోపణలు రావడంతో గతేడాది ఆమెను లోక్‌సభ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. దాంతో మరోసారి ఆమెకు టికెట్‌ దక్కుతుందో, లేదోననే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి ఆ స్థానం నుంచి మహువానే నిలబెట్టారు. 
  • సందేశ్‌ఖాలీ: పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC)(సస్పెన్షన్‌కు గురైన)కు చెందిన షాజహాన్‌ షేక్‌, అతడి అనుచరులు.. మహిళలపై అకృత్యాలకు పాల్పడటమే గాక, వారి భూములను బలవంతంగా లాక్కొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలతో ఎన్నికల వేళ టీఎంసీ తీవ్ర ఇరకాటంలో పడింది. మరోవైపు ఆ అకృత్యాలకు వ్యతిరేకంగా మహిళలు చేపట్టిన ఆందోళనలకు నాయకత్వం వహించిన రేఖా పత్రాకు భాజపా తన అభ్యర్థిగా ప్రకటించింది. సందేశ్‌ఖాలీ గ్రామం ఉన్న బసిర్‌హట్‌ స్థానం నుంచి ఆమెను నిలబెట్టింది. షేక్ నరుల్ ఇస్లామ్‌ను టీఎంసీ బరిలో ఉంచింది. దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చినప్పటికీ.. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో నరుల్ ఆధిక్యం ప్రదర్శిస్తుండటం గమనార్హం. రేఖ వెనకంజలో ఉన్నారు.  
  • ఫరీద్‌కోట్‌:  లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ వేళ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హంతకుల్లో ఒకడైన బియాంత్‌సింగ్‌ కుమారుడు సరబ్‌జీత్‌ సింగ్ ఖల్సా ముందంజలో ఉన్నారు. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో తన సమీప ఆమ్‌ఆద్మీ పార్టీ అభ్యర్థిపై 50 వేలకుపైగా ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఖల్సా స్వతంత్ర అభ్యర్థిగా పోటీపడ్డారు. అయితే ఆయన బరిలో ఉండటం అప్పట్లో చర్చనీయాంశమైంది.  
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని