Prashant Kishor: వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో వైకాపాకు ఘోర పరాజయం ఎదురు కాబోతోందని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ మరోసారి స్పష్టం చేశారు.

Published : 20 May 2024 06:39 IST

భాజపాకు 2019 నాటితో సమానంగా  కానీ, అంతకంటే మెరుగ్గా గానీ  సీట్లు రావొచ్చని వ్యాఖ్య

ఈనాడు, దిల్లీ ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో వైకాపాకు ఘోర పరాజయం ఎదురు కాబోతోందని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ మరోసారి స్పష్టం చేశారు. ప్రముఖ పాత్రికేయురాలు బర్కాదత్‌కు ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టారు. తాము ఎన్నికల్లో గెలవబోతున్నామని జగన్‌మోహన్‌రెడ్డి చెబుతున్నట్లుగానే రాహుల్‌గాంధీ, తేజస్వి యాదవ్, అమిత్‌ షా కూడా చెబుతున్నారని.. పదేళ్లుగా ఎన్నికల క్షేత్రంలో పనిచేస్తున్న తనకు ఫలితాలకు ముందే ఓటమిని అంగీకరించినవారు ఎవరూ కనిపించలేదని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు రోజు నాలుగు రౌండ్లు పూర్తయిన తర్వాత కూడా మీరు వేచి చూడండి.. మున్ముందు రౌండ్లలో మాకు మెజార్టీ వస్తుందని, ప్రభుత్వం తమదేనని ధీమా వ్యక్తం చేస్తారన్నారు. చంద్రబాబు గెలుస్తామని చెబితే, జగన్‌ గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలుస్తామని చెప్పారని, ఈ చర్చకు అంతమే ఉండదని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్త ఎన్నికల్లో భాజపాకు లోగడ కంటే సీట్లు తగ్గవన్నారు. దేశంలో భాజపా, మోదీలపై అసంతృప్తి ఉంది తప్పితే.. ఆగ్రహం లేదని వెల్లడించారు. అందువల్ల ఈసారి భాజపాకు 2019లో ఉన్న సీట్లకు సమానంగా కానీ, లేదంటే అంతకంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని