Prem Singh Tamang: గురువు పార్టీని కూకటి వేళ్లతో పెకిలించి... ఎవరీ ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్‌?

సిక్కింలో మొత్తం 32 స్థానాలకు గానూ 31 చోట్ల విజయం సాధించిన కాంత్రికారీ మోర్చా.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు.

Updated : 02 Jun 2024 21:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈశాన్య రాష్ట్రం సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో  (Sikkim Assembly Elections)సిక్కిం క్రాంతికారీ మోర్చా (SKM) ప్రభంజనం సృష్టించింది. మొత్తం 32 స్థానాలకు గానూ 31 చోట్ల విజయం సాధించింది. ప్రతిపక్ష సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (SDF)ను కోలుకోలేని దెబ్బకొట్టింది. 25 ఏళ్లపాటు అప్రతిహతంగా రాష్ట్రాన్ని పాలించిన పార్టీకి 2019 ఎన్నికల్లో తొలిసారిగా ఓటమిని రుచి చూపించిన ఎస్‌కేఎం అధ్యక్షుడు, సీఎం ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్‌ (Prem singh tamang).. వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు. అయితే, ఈ విజయాల వెనుక ఆయన అవిరళ కృషి, పట్టుదల, శ్రమ దాగి ఉన్నాయి.

ఉపాధ్యాయుడిగా ప్రయాణం ప్రారంభించి..

ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్‌.. అందరికీ పీఎస్‌ గోలేగా సుపరిచితుడు. 1968 ఫిబ్రవరి 5న నేపాలీ దంపతులకు జన్మించారు. పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన ఆయన.. 1990లో ప్రభుత్వపాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు. మూడేళ్ల పాటు పాఠాలు బోధించి.. సామాజిక సేవపై ఆసక్తి చూపించారు. క్రమంగా రాజకీయం వైపు మళ్లారు. 1994లో పవన్‌ చామ్లింగ్‌ స్థాపించిన సిక్కిం డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌లో చేరి, కీలక నాయకుడిగా ఎదిగారు. వరుసగా ఐదుసార్లు ఎస్‌డీఎఫ్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 వరకు వివిధ మంత్రిత్వశాఖలను నిర్వహించారు.

రాజకీయ గురువుపై తిరుగుబావుటా

2009 ఎన్నికల తర్వాత ఆయనకు పార్టీతో విభేదాలు తలెత్తాయి. ఎమ్మెల్యేగా గెలుపొందినా.. పవన్‌ చామ్లింగ్‌ మాత్రం ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. దానికి బదులుగా పరిశ్రమల శాఖ ఛైర్‌పర్సన్‌గా నామినేట్‌ చేశారు. దీనిని తిరస్కరించిన తమాంగ్‌.. చామ్లింగ్‌ బంధుప్రీతి, అవినీతిలో కూరుకుపోయారని ఆరోపిస్తూ.. రాజకీయ గురువుపైనే తిరుగుబావుటా ఎగురవేశారు. 2009 డిసెంబర్‌ 21న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి.. సొంత ప్రభుత్వంపైనే తిరుగుబాటుకు సిద్ధమైనట్లు ప్రకటించారు. ఈ సమావేశమే ఎస్‌డీఎఫ్‌ పతనానికి పునాది అయ్యింది. తదనంతర కాలంలో పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. 2013లో సిక్కిం క్రాంతికారీ మోర్చా (ఎస్‌కేఎం) పేరుతో పార్టీని స్థాపించారు.

తొలి ప్రయత్నంలోనే 10 సీట్లు

పార్టీ ఏర్పాటైన ఏడాది కాలంలో ఎన్నికల పండగొచ్చింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎస్‌కేఎం అన్ని స్థానాల్లోనూ ఒంటరిగా పోటీకి దిగింది. మొత్తం 32 స్థానాలకు గానూ 10 స్థానాలను గెలుచుకొని బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. ఇదే అదునుగా భావించిన చామ్లింగ్‌ ప్రభుత్వం తమాంగ్‌ను ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నించింది. 1994-1999 మధ్య కాలంలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా పని చేసిన ఆయన.. రూ.10 లక్షల ప్రభుత్వ ధనాన్ని వృథా చేశారన్న అభియోగంపై జైలుకు పంపింది. దిగువ స్థాయి కోర్టు తీర్పును ఆయన హైకోర్టులో ఛాలెంజ్‌ చేసినా ఫలితం లేకపోయింది.

ప్రజల గుండెల్లో దేవుడు

ప్రభుత్వ నియంతృత్వ చర్యలతో తమాంగ్‌ పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. తన రాజకీయ గురువు చామ్లింగ్‌పై తిరుగుబావుటా ఎగరేయడం వల్లే ఆయన్ని జైలుకు పంపించారని ప్రజలు బలంగా విశ్వసించారు. 2018లో జైలు నుంచి విడుదలైన తమాంగ్‌కు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎస్‌కేఎం 17 స్థానాలను కైవసం చేసుకొని ప్రభుత్వ ఏర్పాటు చేసింది. అయితే, ఈ ఎన్నికల్లో తమాంగ్‌ పోటీ చేయలేదు. తనపై కేసు ఉండటంతో ఒకవేళ విజయం సాధించినా.. అది చెల్లుబాటు అవుతుందో లేదో అనే సంశయంలో ఉండిపోయారు. 

తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం

ఎలాగైతేనేమి.. 25 ఏళ్ల ఎస్‌డీఎఫ్‌ పాలనకు చరమగీతం పాడుతూ.. 2019, మార్చి 27న తొలిసారిగా తమాంగ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో విజయం సాధించి సీఎం పదవిని పదిలం చేసుకున్నారు. తన పాలనతో సిక్కిం ప్రజల అభిమానాన్ని చూరగొన్న తమాంగ్‌కు అక్కడి ప్రజలు తాజాగా రెండో సారి పట్టం గట్టారు. కనీవినీ ఎరుగని రీతిలో 31 స్థానాలను కట్టబెట్టారు.తమాంగ్‌కు రాజకీయ గురువైన చామ్లింగ్‌ తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ పరాజయం పాలవ్వడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు