Priyanka Gandhi: హిమాచల్‌లో ‘ఆపరేషన్‌ కమలం’కు ప్రియాంక అడ్డుకట్ట!

హిమాచల్‌ ప్రదేశ్‌లో భాజపా చేసిన ‘ఆపరేషన్‌ కమలం’ (Operation Lotus) ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసి ప్రజా తీర్పును రక్షించడంలో ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) కీలక పాత్ర పోషించారని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి.

Published : 01 Mar 2024 01:35 IST

దిల్లీ: హిమాచల్‌ ప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నిక (Rajya Sabha Elections) అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోయే స్థితికి చేరుకుంది. ప్రభుత్వంపై ‘అవిశ్వాసం’ అస్త్రం ప్రయోగించేందుకు భాజపా ప్రయత్నాలు మొదలుపెట్టిందనే వార్తలు వినిపించాయి. ఈనేపథ్యంలో భాజపా చేసిన ‘ఆపరేషన్‌ కమలం’ (Operation Lotus)కు అడ్డుకట్ట వేసి ప్రజాతీర్పును రక్షించడంలో ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) కీలకపాత్ర పోషించినట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి.

హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా కుట్ర పన్నిందని ఆరోపించిన కాంగ్రెస్‌.. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా పార్టీ నియంత్రణలోనే ఉన్నాయని తెలిపింది. ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కాషాయ పార్టీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని పేర్కొంది. ఇందులో పార్టీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంకాగాంధీ కీలకపాత్ర పోషించారని.. అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు ఇతర సీనియర్లతో కలిసి చురుకుగా వ్యవహరించారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా తిరుగుబాటు చేస్తే సహించేది లేదన్న సందేశాన్ని బలంగా పంపినట్లు పేర్కొన్నాయి.

ఎమ్మెల్యేల ఫిరాయింపులతో కూలిన ప్రభుత్వాలు

‘రాజ్యసభ ఎన్నిక తర్వాత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల తిరుగుబాటు చూస్తే కాంగ్రెస్‌ చేతి నుంచి మరో రాష్ట్రం పోతుందని అనిపించింది. కానీ, పార్టీ అధిష్ఠానం వేగంగా, కఠినంగా వ్యవహరించింది. ఇది తిరుగుబాటు సంక్షోభాన్ని నివారించడమే కాకుండా ప్రభుత్వాన్ని కాపాడింది’ అని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తాజా పరిణామాలతో ఆపరేషన్‌ కమలంకు అడ్డుకట్ట పడటంతోపాటు సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు ఇమేజ్‌ కూడా బలపడిందని పేర్కొన్నాయి. ఇదిలాఉంటే, 2022లో జరిగిన హిమాచల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంకాగాంధీ కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. అంతకుముందు కూడా ఆమె అక్కడ ట్రబుల్‌ షూటర్‌గా పేరు పొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని