Priyanka Gandhi: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు.. రాహుల్‌పై ప్రియాంక ఎమోషనల్‌ పోస్టు

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ గతంలో కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. ఈ సమయంలో ప్రియాంకాగాంధీ తన సోదరుడిని ఉద్దేశించి ఒక ఎమోషనల్ పోస్టు పెట్టారు. 

Published : 05 Jun 2024 13:41 IST

దిల్లీ: ఓటములతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న కాంగ్రెస్‌ను మరింత ముంచుతున్నారంటూ రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంకాగాంధీ(Priyanka Gandhi)పై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. వాటిని తట్టుకొని చేసిన పోరాటానికి తగ్గట్టుగా సానుకూల ఫలితాలు వచ్చాయి. ఈక్రమంలో రాహుల్‌ను కొనియాడుతూ ప్రియాంక చేసిన పోస్టు ఆకట్టుకుంటోంది.

‘‘వారు నిన్ను అడ్డుకునేందుకు ఏమీ చేసినా, ఏ మాటలు అన్నా నువ్వు దృఢంగా నిల్చొని ఉన్నావ్‌. అవరోధాలు ఎదురైనప్పుడు వెనక్కి తగ్గలేదు. నీ సిద్ధాంతాన్ని ఎంతగా అవమానించినా నమ్మకం కోల్పోలేదు. వారు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా.. సత్యం కోసం నీ పోరాటాన్ని ఆపలేదు. ప్రతిరోజు వారు నీకు ద్వేషం, కోపాన్ని పంచినా దానిని నీ దరి చేరనివ్వలేదు. ప్రేమ, సత్యం, దయాగుణంతోనే ముందుకువెళ్లావు. ఇంతకాలం నిన్ను చూడలేనివారు.. ఇప్పుడు చూస్తారు. కానీ నీవు మాలో అందరికంటే ధైర్యవంతుడివని మాకు తెలుసు’’ అని ఉద్వేగపూరితంగా పోస్టు పెట్టారు.

ఈ లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన ఫలితాల్లో కాంగ్రెస్‌కు ఘోరమైన ఫలితాలు రావడంతో ఈసారి రిజల్ట్‌ అలాగే ఉంటుందని అంతా భావించారు. రాహుల్, ప్రియాంకతో పార్టీని కాపాడటం కష్టమనే భావన వ్యక్తమైంది. వారిద్దరూ ఐరన్ లెగ్‌లంటూ భాజపా అపహాస్యం చేసిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం ఉదయం ఫలితాల సరళి మొదలైన దగ్గరినుంచి ఆ పార్టీకి ప్రాణం లేచొచ్చింది. అధికారంలోకి రాకపోయినా, తిరిగి పుంజుకుంటామనే ధైర్యం వచ్చింది. ఇందుకు ఈ తోబుట్టువుల ప్రచారంతో పాటు అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యూహాలు తోడయ్యాయని విశ్లేషకులు వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని