Purandeswari: రాక్షస పాలన అంతం కోసం జనం కసితో ఓటేశారు

‘ఎన్నికల్లో ఇంతటి ఘన విజయం సాధించగలమని ఊహించలేదు. కచ్చితంగా అధికారంలోకి వస్తామనే భావన ఉన్నా.. ఎన్నికల్లో వచ్చిన మెజార్టీలు చూస్తే ప్రజలు ఎంత కసితో ఓటేశారో తెలుస్తోంది.

Published : 12 Jun 2024 03:35 IST

కూటమికి ఘన విజయం కట్టబెట్టారు
కక్షలొద్దని కార్యకర్తలకు చెప్పాలి..  
భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి 

చంద్రబాబు, పురందేశ్వరి ఆత్మీయ పలకరింపు

ఈనాడు-అమరావతి: ‘ఎన్నికల్లో ఇంతటి ఘన విజయం సాధించగలమని ఊహించలేదు. కచ్చితంగా అధికారంలోకి వస్తామనే భావన ఉన్నా.. ఎన్నికల్లో వచ్చిన మెజార్టీలు చూస్తే ప్రజలు ఎంత కసితో ఓటేశారో తెలుస్తోంది. ఎలాగైనా ప్రజా వ్యతిరేక పాలన అంతమొందించాలని, జగన్‌ అనే రాక్షస పాలకుణ్ని ఇంటికి పంపాలనే పట్టుదల వారి మనసులో ఉంది. ఆ విషయాన్ని ఓటు ద్వారా వెల్లడించారు. తెలుగు ప్రజలకు ధన్యవాదాలు’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీగా ఎన్నికైన దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబును భాజపా తరపున బలపరుస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ‘గత అయిదేళ్లలో ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. విధ్వంసక, విద్వేష, కక్షపూరిత పాలనకు బలయ్యారు. నిజమైన సంక్షేమానికి దూరమై విసిగి వేసారిపోయారు’ అని పురందేశ్వరి వివరించారు. ‘ఈ విజయం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయని అందరూ గ్రహించాలి. పాలకులు అభివృద్ధిని పట్టించుకోకుంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయమై ప్రజల హెచ్చరిక ఇది. గెలిచాం, అధికారంలోకి వచ్చామనే భావన కంటే.. సుపరిపాలన అందించడంపైనే దృష్టి పెట్టాలి’ అని సూచించారు. ‘ప్రజలకు సంక్షేమ, సుపరిపాలన ఎలా అందించాలనే దానిపై దృష్టి పెట్టాలి. గత అయిదేళ్లలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో కక్షపూరితంగా వ్యవహరించవద్దని కార్యకర్తలకు చెప్పాలి. నేతలు సంయమనం పాటించడమే కాకుండా.. కార్యకర్తలు కూడా సంయమనం పాటించేలా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది’ అని నిర్దేశించారు.  

చంద్రబాబు యుక్తి, మోదీ స్ఫూర్తి, పవన్‌ శక్తి 

‘ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయం, ఎన్నిక జరిగిన తీరు, మూడు పార్టీల సమన్వయం భారతదేశానికే ఒక నమూనా అవుతుందనే అభిప్రాయం దిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశంలో వ్యక్తమైంది. ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించాం. దీనికి కారకులైన నాయకులకు మాత్రమే కాకుండా.. మూడు పార్టీలకు సంబంధించిన ప్రతి కార్యకర్తకు శిరసు వంచి నమస్కరిస్తున్నా’ అని పురందేశ్వరి చెప్పారు. ‘సబ్‌ కా సాత్, సబ్‌కా వికాస్‌ అనేది భాజపా సంకల్పం. ఎక్కడైనా పేదలు, సాధారణ పౌరులకు అన్యాయం జరిగితే గళమెత్తుతామంటూ జనసేన ముందుకొచ్చింది. మూడు పార్టీల ఆవిర్భావం, ఆలోచనా విధానం ఒకే రకంగా ఉన్నాయి’ అని చెప్పారు. ‘సమాజంలో సాధారణ పౌరుడికి న్యాయం చేయాలి. పేదలకు నిజమైన సంక్షేమం అందించాలనే మూడు పార్టీల లక్ష్యం. ఈ కలయిక త్రివేణి సంగమంలా ఉంది. చంద్రబాబు యుక్తి, నరేంద్రమోదీ స్ఫూర్తి, పవన్‌ కల్యాణ్‌ శక్తి.. మూడింటి కలయికగా కూటమి రాష్ట్ర ప్రజల ముందుకు వచ్చింది’ అని పేర్కొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని