Puri Lok Sabha: జగన్నాథుడి ఇలాకాలో విజయం ఎవరిదో?

ఒడిశాలోని పూరీ లోక్‌సభ నియోజవర్గ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ పాగా వేసేందుకు భాజపా, ఈ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని బిజు జనతాదళ్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

Published : 24 May 2024 18:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నిత్యం హరి నామస్మరణతో మార్మోగిపోయే పూరీ క్షేత్రంలో రాజకీయ వేడి రాజుకుంది. జగన్నాథుడు కొలువైన ప్రతిష్ఠాత్మక పూరీ లోక్‌సభ స్థానాన్ని (Puri Lok Sabha Constituency) కైవసం చేసుకునేందుకు భాజపా (BJP), బిజు జనతాదళ్‌ (BJD) తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ స్థానాన్ని రెండు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో 11,714 ఓట్ల తేడాతో పరాజయం పాలైన భాజపా సీనియర్‌ నేత సంబిత్‌ పాత్ర్‌ మళ్లీ ఇదే స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. బిజుద నుంచి మాజీ ఐపీఎస్‌ అధికారి అరూప్‌ పట్నాయక్‌ రంగంలోకి దిగారు. మరోవైపు కాంగ్రెస్‌ కూడా జయనారాయణ పట్నాయక్‌ను పోటీలో నిలిపింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘పూరీ’.. రాజకీయంగానూ ప్రతిష్ఠాత్మకంగా మారింది. ప్రచారంలోనూ వివిధ పార్టీలకు ‘పూరీ క్షేత్రం’ కేంద్ర బిందువుగా మారింది. జాతీయస్థాయి నాయకులు క్షేత్ర అభివృద్ధిపైనే విమర్శనాస్త్రాలు సంధించారు.

ఎవరేంటి?

స్థానికుడైన సంబిత్‌ పాత్ర్‌ గతంలో కేంద్ర పర్యాటక కార్పొరేషన్‌ అధ్యక్షుడిగా, భాజపా కేంద్రశాఖ అధికార ప్రతినిధిగా సేవలందించారు. ప్రధాని నరేంద్ర మోదీకి సన్నిహితుడిగా పేరుంది. బిజద తరఫున బరిలో నిలిచిన అరూప్‌ స్వస్థలం కూడా పూరీయే అయినప్పటికీ.. ఉద్యోగరీత్యా గతంలో మహారాష్ట్రలో పని చేశారు. ముంబయి పోలీస్‌ కమిషనర్‌గా పని చేసి ఉద్యోగ విరమణ చేసిన ఆయన.. గత ఎన్నికల్లో భువనేశ్వర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. తాజాగా పూరీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. స్థానికుడే అయినప్పటికీ ఇక్కడివారితో పెద్దగా సంబంధాలు లేకపోవడం ఆయనకు ప్రతికూల అంశం.

కాంగ్రెస్‌ అంతంతే..

ఏఐసీసీ అధిష్ఠానం తొలుత పూరీ స్థానానికి సుచరిత మహంతిని అభ్యర్థిగా ప్రకటించింది. కానీ, నామినేషన్‌ దాఖలుకు ముందు ఆమె పోటీ నుంచి వైదొలిగారు. సొంత ఖర్చులతో ప్రచారం చేసుకోవాలని అధిష్ఠానం చెప్పడంతో ఆ ఖర్చు భరించలేకే వైదొలగినట్లు సుచరిత వెల్లడించారు. దీంతో కాంగ్రెస్‌ నాయకత్వం జయనారాయణను బరిలో దించింది. ఆయన సీనియర్‌ నేత అయినా పెద్దగా ఆదరణ లేదు. కార్యకర్తల బలం నామమాత్రంగానే కనిపిస్తోంది. 

పూరీ ఓటర్లు ఎవరి వైపో?

పూరీ లోక్‌సభ పరిధిలో బ్రహ్మగిరి, సత్యబాది, పూరీ, పిపిలి, చిలికా, రణపూర్‌, నామపడ అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఆయా ప్రాంతాల్లో భాజపా, బిజద అభ్యర్థులు నువ్వా- నేనా అన్నట్లుగా ప్రచారం నిర్వహించారు. మోదీ గ్యారంటీ తన విజయానికి బాటలు వేస్తుందని భాజపా అభ్యర్థి సంబిత్‌ అంటున్నారు. నవీన్‌ ఆదరణ, నిజాయతీ కలిసొస్తాయని అరూప్‌ భావిస్తున్నారు. అయితే పూరీ ఓటర్ల నిర్ణయం మరికొన్ని గంటల్లో ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. ఈ నియోజకవర్గానికి శనివారం (మే 25)న పోలింగ్‌ జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని