Raghunandan Rao: మెదక్‌ ఎంపీ స్థానంలో పోటీకి భారాసకు స్థానికులు దొరకడం లేదా?: రఘునందన్‌రావు

భారాస, కాంగ్రెస్‌ పాలనకు తేడా కనిపించట్లేదని భాజపా మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు విమర్శించారు.

Published : 24 Mar 2024 14:46 IST

మెదక్: భారాస, కాంగ్రెస్‌ పాలనకు తేడా కనిపించట్లేదని భాజపా మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు విమర్శించారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో బూత్ అధ్యక్షుల సమావేశంలో ఆయన  మాట్లాడారు. భారాస ప్రభుత్వం రూ.లక్ష రుణమాఫీని పదేళ్ల పాటు చేయలేదని, 100 రోజుల్లో ఆ హామీని నెరవేరుస్తామని చెప్పిన కాంగ్రెస్‌ మాటతప్పిందని విమర్శించారు. రాష్ట్రానికి నిధులు రావాలంటే భాజపా ఎంపీలను గెలిపించాలని కోరారు.

‘‘మెదక్‌లో భారాసకు స్థానికులు దొరకడం లేదా? కరీంనగర్‌ నుంచి హరీశ్‌రావును తీసుకొచ్చి ఇక్కడ రుద్దారు. ఆయన చాలదన్నట్లు ఇప్పుడు వెంకట్రామిరెడ్డిని తీసుకొచ్చారు. వెంకట్రామిరెడ్డిది ఏ జిల్లా.. ఏ ఊరో ఆయనకే తెలియదు. కలెక్టర్‌గా ప్రజలను దోచుకున్నారు.. ఇప్పుడు ఆ డబ్బు ఖర్చుపెట్టి గెలవాలని చూస్తున్నారు. ఆయనకు ఇతరులను దోచుకోవడం తప్ప తెలిసిందేం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 90 రోజుల్లో రూ.9 వేల కోట్లు అప్పులు చేశారు. కేంద్ర ప్రభుత్వం దయతలిస్తేనే ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి నెలకొంది. సీఎం 17 ఎంపీ సీట్లు గెలిస్తే దిల్లీ పోయి డబ్బులు తీసుకొస్తా అంటున్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారో చెప్పాలి. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే భవిష్యత్తు కనిపించడంలేదు. తెలంగాణలో ఆ పార్టీకి ఓట్లు పడితే నిజాంపేట చెరువులో మునిగినట్లే. దేశంలో మూడో సారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలి.’’ అని రఘునందన్‌రావు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని