Raghurama: తెదేపా - జనసేన కూటమి నుంచే నరసాపురం ఎంపీగా పోటీ: రఘురామ

ఏ పార్టీలో చేరనప్పటికీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం ఒక్కటైన తెదేపా-జనసేన ఉమ్మడి సభకు వచ్చినట్లు ఎంపీ రఘు రామకృష్ణ రాజు తెలిపారు.

Updated : 28 Feb 2024 20:51 IST

తాడేపల్లిగూడెం: ఏ పార్టీలో చేరనప్పటికీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం ఒక్కటైన తెదేపా - జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ను అభినందించడానికే... వారి ఉమ్మడి సభకు వచ్చినట్లు ఎంపీ రఘు రామకృష్ణ రాజు తెలిపారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన తెలుగు జన విజయకేతనం ‘జెండా’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తిని చరిత్రపుటల్లో కలిపే సమయం వచ్చిందన్నారు. ఏ పార్టీలో చేరకున్నా.. వచ్చే ఎన్నికల్లో ఈ కూటమి తరఫునే నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని రఘురామ ప్రకటించారు. త్వరలోనే ప్రజల్లోకి వస్తానని చెప్పారు.

సిద్ధమా అని రోడ్డెక్కిన వ్యక్తితో యుద్ధం చేసి ఓడించేందుకు ఈ సభ తొలి అడుగు. తెదేపా-జనసేన పార్టీ కూటమి రాష్ట్రంలో చరిత్రను సృష్టిస్తుంది. ఇది ప్రజలు కోరుకున్న పొత్తు. ఇరు పార్టీల శ్రేణులు కష్టపడితే వచ్చే ఎన్నికల్లో 160 స్థానాల్లో ఘన విజయం సాధిస్తుంది - అచ్చెన్నాయుడు, ఏపీ తెదేపా అధ్యక్షుడు

వైకాపా ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. రైతు ఉనికే లేకుండా చేస్తోంది. రాష్ట్రంలో కులాలు, మతాల పేరుతో చిచ్చు పెడుతున్నారు. తెదేపాకు ఉన్న బలం.. పార్టీ కార్యకర్తలే. ఎన్టీఆర్‌ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. బడుగు బలహీన వర్గాలను అధికార పీఠంపైకి ఎక్కించారు. ప్రజలంతా తెదేపా-జనసేన కూటమిని ఆశీర్వదించాలని కోరుతున్నా - నందమూరి బాలకృష్ణ, తెదేపా ఎమ్మెల్యే, నటుడు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని