Rahul Gandhi: భాజపా దృష్టిలో స్త్రీలు ద్వితీయశ్రేణి పౌరులు

మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగానే చూడాలనేది భాజపా ఉద్దేశమని, ఆ పార్టీకి సైద్ధాంతిక మాతృసంస్థ అయిన ఆరెస్సెస్‌ శాఖల్లోనూ మహిళలకు ప్రవేశం లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు.

Updated : 24 May 2024 06:27 IST

ఆరెస్సెస్‌ శాఖల్లోనూ వారికి ప్రవేశం లేదు 
దిల్లీ సభలో రాహుల్‌ ఆవేదన 

దిల్లీ: మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగానే చూడాలనేది భాజపా ఉద్దేశమని, ఆ పార్టీకి సైద్ధాంతిక మాతృసంస్థ అయిన ఆరెస్సెస్‌ శాఖల్లోనూ మహిళలకు ప్రవేశం లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. వాయవ్య దిల్లీ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మంగోల్‌పురిలో గురువారం మహిళలతో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ‘‘చాలా హడావుడి చేసి మహిళా రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంటులో భాజపా ఆమోదింపజేసినా, చావుకబురు చల్లగా చెప్పినట్లు.. జనాభా లెక్కలు తేలాక పదేళ్ల తర్వాత దానిని అమలుపరుస్తామని ప్రకటించింది. దీనివెనుక ఓ సిద్ధాంతం ఉంది. మహిళల్ని ఆరెస్సెస్‌ చేర్చుకోదు. వారిని ద్వితీయ పౌరులుగా చూడాలనే భావజాలం బలంగా పాతుకుపోవడమే దానికి కారణం’’ అని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లు పెంచుతామని చెప్పారు. 


ఏపీ-తెలంగాణ భవన్‌లో భోజనం చేసిన రాహుల్‌

ఏపీ-తెలంగాణభవన్‌లో రాహుల్‌గాంధీకి మామిడిపండ్లు అందిస్తున్న అభిమాని

ఈనాడు, దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు రాబోతున్నాయని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం ఆయన దిల్లీలోని ఏపీ-తెలంగాణ భవన్‌ క్యాంటీన్‌కు వచ్చి భోజనం చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌తోపాటు, తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లురవి కూడా పాల్గొన్నారు. భోజనం తర్వాత బయటికెళ్తూ మీడియాతో మాట్లాడారు. ‘వచ్చేనెల 4న రానున్న ఫలితాలు మీ అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. ఇండియా కూటమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దిల్లీలో ఏడుకి ఏడు స్థానాలను ఈ కూటమి గెలుచుకుంటుంది’ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని