Rahul Gandhi: చిన్న మదుపరులకు రూ.30 లక్షల కోట్ల నష్టం

ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కలిసి స్టాక్‌మార్కెట్‌ కుంభకోణానికి పాల్పడ్డారని, దానివల్ల చిన్న మదుపరులు రూ.30 లక్షల కోట్లు నష్టపోవాల్సి వచ్చిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు.

Published : 07 Jun 2024 05:24 IST

మోదీ, షా స్టాక్‌మార్కెట్‌ కుంభకోణానికి పాల్పడ్డారు: రాహుల్‌ 

దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కలిసి స్టాక్‌మార్కెట్‌ కుంభకోణానికి పాల్పడ్డారని, దానివల్ల చిన్న మదుపరులు రూ.30 లక్షల కోట్లు నష్టపోవాల్సి వచ్చిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఈ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ‘తప్పుడు ఎగ్జిట్‌పోల్స్‌ తర్వాత స్టాక్‌మార్కెట్లు ఎగిసి, 4వ తేదీన ఓట్ల లెక్కింపు మొదలుకాగానే కుప్పకూలాయి. ఇది అతిపెద్ద స్టాక్‌మార్కెట్‌ స్కాం. ఎన్నికలు జరుగుతున్న సమయంలో మోదీ, అమిత్‌ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లు స్టాక్‌మార్కెట్‌పై వ్యాఖ్యానించారు. ఇలాంటిది తొలిసారిగా చూస్తున్నాం. పెట్టుబడులపై ప్రజలకు మోదీ, అమిత్‌ షా ఎందుకు సలహా ఇచ్చారు? ఎగ్జిట్‌పోల్స్‌ తప్పు అనే సమాచారం భాజపా నేతలకు ఉంది. సమగ్ర విచారణ జరిపితే ఆసక్తికర వివరాలు బయటపడతాయి. ఆ ఇద్దరు నేతలతో పాటు ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించినవారిపైనా విచారణ జరపాలి’ అని పేర్కొన్నారు.  

రాహుల్‌ వ్యాఖ్యలు నిరాధారమని భాజపా ఖండించింది. పెట్టుబడిదారుల్ని తప్పుదారి పట్టించేందుకు ఆయన కుట్ర చేస్తున్నారని సీనియర్‌ నేత పీయూష్‌ గోయల్‌ ఆరోపించారు. ఫలితాలు వెలువడిన రోజున కాంగ్రెస్‌కు సీట్లు పెరుగుతుంటే మార్కెట్‌ పడిపోయిందని, తిరిగి ఎన్డీయే అధికారంలోకి వస్తోందని నమ్మకం కలిగాక మార్కెట్‌ పెరుగుతోందని గుర్తు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని