Rahul-Priyanka: అన్నాచెల్లెళ్ల అసాధారణ పోరు

రాహుల్‌ గాంధీ.. ప్రియాంకా గాంధీ.. గాంధీ కుటుంబానికి వారసులు.. కాంగ్రెస్‌కు ఆశాకిరణాలు.. కానీ లోక్‌సభ ఎన్నికల ముందునాటి వరకైతే వారిపై పార్టీకి పెద్దగా ఆశల్లేవ్‌. మునిగిపోతున్న పార్టీని మరింత ముంచుతున్నారనే విమర్శలనూ ఎదుర్కొన్నారు.

Updated : 05 Jun 2024 07:27 IST

భాజపా అపహాస్యానికి సరైన సమాధానం
రాహుల్, ప్రియాంకల కష్టానికి ఫలితం
అధ్యక్షుడి పాత్రా ప్రశంసనీయమే

రాహుల్‌ గాంధీ.. ప్రియాంకా గాంధీ.. గాంధీ కుటుంబానికి వారసులు.. కాంగ్రెస్‌కు ఆశాకిరణాలు.. కానీ లోక్‌సభ ఎన్నికల ముందునాటి వరకైతే వారిపై పార్టీకి పెద్దగా ఆశల్లేవ్‌. మునిగిపోతున్న పార్టీని మరింత ముంచుతున్నారనే విమర్శలనూ ఎదుర్కొన్నారు. వారిద్దరూ ఐరన్‌ లెగ్‌లంటూ భాజపా అపహాస్యం చేసింది కూడా.. అంతకుముందు జరిగిన పలు ఎన్నికల్లో రాహుల్, ప్రియాంక తీవ్రంగా ప్రచారం చేసినా ఘోరమైన ఫలితాలు రావడమే ఇందుకు కారణం. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి ఓటమి తప్పదనే అంతా భావించారు. రాహుల్, ప్రియాంకలతో పార్టీని కాపాడటం కష్టమనే భావనకు వచ్చారు. కానీ ఎన్నికల ఫలితాల సరళి ప్రారంభమైన మంగళవారం ఉదయం నుంచీ కాంగ్రెస్‌ పార్టీకి ప్రాణం లేచొచ్చింది. పార్టీ అధికారంలోకి రాలేకపోయినా ఊపిరిలూదుకుంది. ఇందులో అన్నా చెల్లెళ్ల కష్టమే అధికంగా ఉందని చెప్పవచ్చు. వారిద్దరే పార్టీకి జవసత్వాలందించారు. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న పార్టీని గట్టెక్కించారు. వారితోపాటు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున ఖర్గే అనుసరించిన వ్యూహం సత్ఫలితాలనిచ్చింది. ప్రతిపక్షాలను ఏకం చేయడంలో ఆయన పడ్డ కష్టానికి తగిన ఫలితం కనిపించింది. 

 • రాహుల్‌ 107. ప్రియాంక 108 సభలు, ర్యాలీలు, రోడ్డు షోలలో పాల్గొన్నారు.
 • వయోభారంతో ఉన్నా ఖర్గే భారీగా సభల్లో పాల్గొనడంతోపాటు పార్టీ నేతలు, కార్యకర్తలకు సరైన దిశానిర్దేశం చేశారు.
 • అనారోగ్యంతో బాధపడుతున్న సోనియా గాంధీ ప్రచారంలో పాల్గొనకపోయినా ఇండియా కూటమి పార్టీలను ఒక్క తాటిపైకి తేవడంలో కీలక పాత్ర పోషించారు. 

కాంగ్రెస్‌ వదిలిన బాణం

కాంగ్రెస్‌ ప్రచార బాధ్యతలను సోదరుడితోపాటు ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ భుజానికెత్తుకున్నారు. 16 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 108 ప్రచార కార్యక్రమాలతోపాటు దాదాపు 100 మీడియా సంస్థలతో మాట్లాడారు. ప్రధాని తీవ్ర విమర్శలను ఆమె తన వాగ్ధాటితో తిప్పికొట్టారు. తన తండ్రి చేసిన త్యాగాలను, ఆయన హత్య సమయంలో తాము అనుభవించిన బాధలను ప్రజలకు గుర్తు చేశారు. రెండు వారాలపాటు రాయ్‌బరేలీ, అమేఠీల్లో మకాం వేసి ప్రచారం చేశారు. దేశవ్యాప్తంగా ఆమె సభలకు భారీగా జనం హాజరయ్యారు. ‘సమర్థ ప్రచారకర్త కోసం గత కొన్నాళ్లుగా కాంగ్రెస్‌ ఎదురుచూస్తోంది. 2024 ఎన్నికల నాటికి ప్రియాంకా గాంధీ రూపంలో ఆ పార్టీకి మోదీకి దీటుగా సమాధానమివ్వగల బలమైన నేత దొరికారు. దేశవ్యాప్తంగా జనాకర్షణగల నాయకురాలిగా ఎదిగారు’ అని రచయిత రషీద్‌ కిద్వాయ్‌ పేర్కొన్నారు. 

 • కాంగ్రెస్‌ వస్తే మన బంగారం, మంగళసూత్రాలను లాక్కుంటుందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను బెంగళూరులో ప్రియాంక గట్టిగా తిప్పికొట్టారు. తన తల్లి సోనియా గాంధీ దేశం కోసం తన మంగళ సూత్రాన్ని త్యాగం చేశారని స్పష్టం చేశారు.
 • వ్యూహకర్తగా, మాటల మాంత్రికురాలిగా, జనాకర్షక నేతగా ప్రియాంకా గాంధీ నిరూపించుకున్నారు. 
 • ప్రియాంక పాల్గొన్న పలు సభలు సంభాషణల మాదిరిగా సాగేవి. ప్రజలతో మమేకమయ్యేలా ఉండేవి. ఆలోచనలను పంచుకునేలా సాగేవి. 
 • కులాలు, మతాల ఆధారంగా ఓట్లేయవద్దని, జీవన ప్రమాణాలను పెంచే వాటికే ప్రాధాన్యమివ్వాలని ఆమె సూచించేవారు. 

పడిలేచిన కెరటం

పప్పూ, షెజాదీ (యువరాజు) అంటూ రాహుల్‌ గాంధీని గత కొన్నేళ్లుగా భాజపా తీవ్రంగా విమర్శిస్తోంది. గత పదేళ్లుగా ఆయనపైనా, కాంగ్రెస్‌పైనా అదే పనిగా ధ్వజమెత్తుతూ వస్తోంది. కానీ కాలం కలిసి వచ్చింది.. రాహుల్‌ కష్టానికి ఫలితం దక్కింది. గత రెండు ఎన్నికల్లో 50 సీట్లకు అటు ఇటు గెలిచిన ఆ పార్టీ ఈసారి 100 సీట్లకు చేరువగా వచ్చి సంచలనం సృష్టించింది. ఇది గత దశాబ్ద కాలంలో కాంగ్రెస్‌కు అత్యుత్తమ ప్రదర్శన. 

 • భారత్‌ జోడో యాత్ర ద్వారా దేశమంతా తిరిగిన రాహుల్‌ గాంధీ పార్టీకి జవసత్వాలు అందించారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఈ యాత్రలో ఆయన ప్రజలతో మమేకమైన తీరు ఎన్నికల్లో ఓట్లు తెచ్చి పెట్టింది. 
 • ప్రధాని మోదీపై విమర్శలు చేయడంలో పదును, సామాజిక మాధ్యమాల్లో ఆయన చురుకుదనం పార్టీకి కలిసి వచ్చాయి. 
 • 53 ఏళ్ల రాహుల్‌.. సామాజిక న్యాయం నినాదం ద్వారా ప్రజల మనసులను చూరగొన్నారు. తద్వారా ఉత్తర్‌ ప్రదేశ్, రాజస్థాన్, హరియాణాల్లో మంచి ఫలితాలను సాధించగలిగారు. 
 • ప్రజల సమస్యలను, సంక్షేమ పథకాలను రాహుల్‌ ప్రచారాస్త్రాలుగా మలుచుకుని విజయం సాధించారని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.
 • ఉత్తర, దక్షిణ భారతాల్లో పోటీ చేయడంద్వారా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని