Rahul Gandhi: మహిళల ఖాతాల్లో నెలనెలా రూ.8,500

సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే.. ఈ ఏడాది జులై నుంచే మహిళల (దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలవారు) ఖాతాల్లో నెలనెలా రూ.8,500 జమ చేస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు.

Updated : 28 May 2024 05:56 IST

‘ఇండియా’ అధికారంలోకి వస్తే జులై నుంచే జమ
వార్షిక ఆర్థిక సాయాన్ని  రూ.2 లక్షలకు పెంచే అవకాశం: రాహుల్‌గాంధీ

బఖ్తియార్‌పుర్, పాలీగంజ్‌: సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే.. ఈ ఏడాది జులై నుంచే మహిళల (దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలవారు) ఖాతాల్లో నెలనెలా రూ.8,500 జమ చేస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. ఫలితంగా ప్రతి కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని పేర్కొన్నారు. మహిళలకు అందించే ఈ వార్షిక ఆర్థిక సహాయం తొలుత రూ.లక్షగా ఉంటుందని, తర్వాత దాన్ని రూ.2 లక్షలకు పెంచే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. బిహార్‌లోని బఖ్తియార్‌పుర్, పాలీగంజ్, జగదీశ్‌పుర్‌లలో సోమవారం ఆయన ఎన్నికల ప్రచార ర్యాలీల్లో ప్రసంగించారు. అధికారంలోకి రాగానే అగ్నిపథ్‌ పథకాన్ని ఇండియా కూటమి రద్దు చేస్తుందని పునరుద్ఘాటించారు. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌ సహా దేశమంతటా తమకు అనుకూలంగా గాలి వీస్తోందని పేర్కొన్నారు. జూన్‌ 4 తర్వాత మోదీ ప్రధాని పదవిలో ఉండరని జోస్యం చెప్పారు. తనను దేవుడే భూమిపైకి పంపించాడంటూ ప్రధాని వ్యాఖ్యానించడాన్ని రాహుల్‌ ఎద్దేవా చేశారు. ‘‘వచ్చే నెల 4 తర్వాత.. అవినీతి గురించి మోదీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రశ్నిస్తే.. ఆయన తనకేమీ తెలియదంటారు. దేవుడు చెప్పిందే చేశానని పేర్కొంటారు. అందుకోసమే తెలివిగా ఇప్పటి నుంచే తనను దైవదూతగా చెప్పుకొంటున్నారు’’ అని వ్యాఖ్యానించారు. అసలైన విషయాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు మొసలి దాడులు, గంగానదిపై నడవడం వంటి కథల్ని మోదీ అల్లుతుంటారని ఆరోపించారు. 


రాహుల్‌కు తప్పిన ముప్పు 

పాలీగంజ్‌లో రాహుల్‌ సహా ఇతర నేతలు నడుస్తుండగా సభావేదిక స్వల్పంగా కూలింది.  పక్కనే ఉన్న ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ కుమార్తె మీసా భారతి.. రాహుల్‌కు  చేయూతను అందించడంతో ఆయనకు ముప్పు తప్పింది. నేతలెవరూ కింద పడలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని