Rahul Gandhi: అన్ని వర్గాలకు న్యాయం.. కాంగ్రెస్‌ అభిమతం: రాహుల్‌

కాంగ్రెస్‌ అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందని, అదే పార్టీ అభిమతమని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. హైదరాబాద్‌లోని తుక్కుగూడలో ఏర్పాటు చేసిన ‘ కాంగ్రెస్‌ జన జాతర ’సభలో ఆయన మాట్లాడారు. 

Updated : 06 Apr 2024 20:25 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఇచ్చిన హామీలను అమలు చేసినట్లుగానే.. జాతీయస్థాయిలోనూ కచ్చితంగా అమలుచేసి తీరుతామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) అన్నారు. హైదరాబాద్‌లోని తుక్కుగూడలో ఏర్పాటుచేసిన ‘కాంగ్రెస్‌ జన జాతర’ సభ వేదికగా ‘న్యాయ పత్రం’ పేరుతో కాంగ్రెస్‌ రూపొందించిన జాతీయస్థాయి మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 

‘‘కొన్ని నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుక్కుగూడలోనే గ్యారంటీ కార్డు విడుదల చేశాను. రూ.500 సిలిండర్‌, గృహజ్యోతి, మహిళలకు ఉచిత బస్సు, గృహలక్ష్మి, గ్యారంటీలు ఇచ్చాం. వాటిని అమలు చేస్తున్నాం. ఈ సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇప్పటికే 25 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేశాం. మరో 50 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. ప్రజల హృదయాల నుంచి పుట్టిందే మా గ్యారంటీల పత్రం. జాతీయ మేనిఫెస్టోలో 5 గ్యారంటీలు ఉన్నాయి. యువతకు ఏడాదికి రూ.లక్ష వచ్చేలా ఉపాధి కల్పిస్తాం. విద్యావంతులైన యువకులకు సంవత్సరం శిక్షణతోపాటు నెలకు రూ.8,500 ఇస్తాం. మహిళా న్యాయం ద్వారా మహిళలకు ఏటా రూ.లక్ష ఇస్తాం. వాటిని నేరుగా బ్యాంకులోనే జమ చేస్తాం. ఇది ఓ విప్లవాత్మక పథకం. ఇకపై దేశంలో ఏ కుటుంబానికి ఏటా రూ.లక్ష ఆదాయం కంటే తక్కువ ఉండదు’’

‘‘మోదీ ప్రభుత్వం ధనవంతులకే రూ.16 లక్షల కోట్లు రుణమాఫీ చేసింది. రైతుకు ఒక్క రూపాయి కూడా  మాఫీ చేయలేదు. స్వామినాథన్‌ సిఫార్సులను అనుసరించి పంటలకు మద్దతు ధర ఇస్తాం. జాతీయస్థాయిలో కనీస వేతనం  రూ.400కి పెంచుతాం. ఉపాధి హామీ కూలీలకు వేతనం పెంచుతాం. దేశంలో 50శాతం జనాభా బీసీలుండగా... 8శాతం ఎస్టీలు, 15శాతం మంది మైనార్టీలు ఉన్నారు. మొత్తంగా 90శాతం పేదలే ఉన్నారు.  దేశంలో ఏ సంస్థలో చూసినా ఈ 90శాతం మంది కనిపించరు.  దేశంలోని 90 మంది ఐఏఎస్‌ అధికారులు ఉంటే ముగ్గురే బీసీలు. జనాభాలో ఓబీసీలు 50శాతం.. ఐఏఎస్‌ల్లో ఓబీసీల వాటా 3 శాతం మాత్రమే ’’ అని రాహుల్‌ అన్నారు. కాంగ్రెస్‌ అన్నివర్గాలకు న్యాయం చేస్తుందని, ఇదే పార్టీ అభిమతమని చెప్పారు. మోదీ వద్ద ధనం, సీబీఐ, ఈడీ ఉంటే.. కాంగ్రెస్‌ వద్ద ప్రేమ, స్వచ్ఛత ఉన్నాయన్నారు.

భాజపా ఓ వాషింగ్‌ మెషీన్‌

‘‘గత సీఎం ఎలా పనిచేశారో మీ అందరికీ తెలుసు. వేల ఫోన్లు ట్యాప్‌ చేయించారు. రెవెన్యూ, ఇంటెలిజెన్స్‌ వ్యవస్థలను దుర్వినియోగం చేశారు. ట్యాపింగ్‌ ఆధారాలు దొరక్కుండా నదుల్లో పడేశారు. బెదిరించి, భయపెట్టి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు. ఇక్కడ మాజీ సీఎం చేసిందే.. కేంద్రంలో మోదీ చేస్తున్నారు. మోదీ వచ్చే ముందు ఈడీ వస్తుంది. దేశంలోనే భాజపా అతిపెద్ద వాషింగ్‌ మెషీన్‌గా మారింది. దేశంలోని అవినీతిపరులంతా మోదీ ముందే నిల్చొన్నారు. ఎన్నికల సంఘంలోనూ మోదీ మనుషులున్నారు. ఎలక్టోరల్‌ బాండ్ల జాబితా చూస్తే ఏం జరిగిందో మీకే అర్థమవుతోంది.

మనందరిదీ కుటుంబ సంబంధం 

‘‘నాకు ప్రజలకు ఉన్న సంబంధం రాజకీయాలకు అతీతం. మనందరిదీ కుటుంబ సంబంధం. తెలంగాణ ప్రజల సిపాయిలా దిల్లీలో ఉంటా. నా జీవితాంతం చిన్న పిల్లలు పిలిచినా తెలంగాణ వస్తా. ప్రజల స్వప్నం సాకారం చేసేందుకు రాష్ట్రాన్ని ఇచ్చాం. ఈ కొత్త రాష్ట్రం దేశానికే మార్గం చూపాలి. ‘మేడిన్‌ చైనా’ కంటే మిన్నగా ‘ మేడిన్‌ తెలంగాణ’ కావాలి.’’ అని రాహుల్‌ ఆకాంక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు