Rahul letter to modi : మోదీజీ.. కశ్మీరీ పండిట్లపై కనికరం చూపండి: రాహుల్‌

కశ్మీరీ పండిట్‌ సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులను కశ్మీర్‌కు తిరిగి రావాలని బలవంతం చేయొద్దని రాహుల్‌ గాంధీ (Tahul Gandhi) కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీ (Modi)కి లేఖ రాశారు.

Published : 03 Feb 2023 23:30 IST

దిల్లీ: కశ్మీరీ పండిట్‌ (Kashmiri Pandits)లే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులను తిరిగి కశ్మీర్‌కు రావాలని బలవంతం చేయొద్దని కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. భారత్‌ జోడో యాత్రలో భాగంగా జమ్ములో చాలా మంది కశ్మీర్‌ పండిట్‌లను కలిశానని, వాళ్ల కష్టాలు వింటుంటే కన్నీళ్లు వచ్చాయని రాహుల్‌ అన్నారు. విధుల కోసం తిరిగి కశ్మీర్‌కు రావాలని ఉన్నతాధికారులు ఒత్తిడి చేయడంతో వాళ్లంతా దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. ఉగ్రవాదులు ఎప్పుడు దాడి చేసి చంపేస్తారోనని ఆందోళన చెందుతున్నారని, వాళ్లని లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకుండా వాళ్లని వెనక్కి పిలవడం అంత శ్రేయస్కరం కాదని అన్నారు. పండిట్‌ సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులను ఇతర శాఖల్లో భర్తీ చేయాలని కోరారు.

‘‘కశ్మీరీ పండిట్‌లు పడుతున్న ఇబ్బందుల గురించి మీకు తెలుసు అనే అనుకుంటున్నాను. వాళ్ల బాధను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. కశ్మీర్‌ లోయలో పండిట్‌ సామాజిక వర్గానికి చెందిన వారితోపాటు ఇతరులపైనా నిత్యం దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో వాళ్లను తిరిగి కశ్మీర్‌కు వెళ్లాలని బలవంతం చేయడం అంత మంచిది కాదు’’ అని రాహుల్ గాంధీ తన లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా కశ్మీరీ పండిట్‌లను బిచ్చగాళ్లు అంటూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా సంభోదించడంపై రాహుల్‌ గాంధీ మోదీ దృష్టికి తీసుకెళ్లారు. జోడోయాత్ర సందర్భంగా కశ్మీరీ పండిట్లను కలిసినప్పుడు ఎల్‌జీ తమను బిచ్చగాళ్లుగా పేర్కొన్నారంటూ వారంతా రాహుల్‌ ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు. దీనిపై స్పందించిన రాహుల్‌.. ఎల్జీ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మోదీకి రాసిన లేఖలో ఆ ఆంశాన్ని కూడా ప్రస్తావించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని