Rahul Gandhi: మ్యాచ్‌ ఫిక్సింగ్‌ లేకుండా భాజపా 400 దాటడం అసాధ్యం: రాహుల్‌ గాంధీ

ప్రధాని మోదీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. 

Updated : 31 Mar 2024 15:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎటువంటి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ లేకుండా భాజపా 400 సీట్ల లక్ష్యాన్ని అందుకోవడం అసాధ్యమని కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) అభిప్రాయపడ్డారు. దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరుగుతున్న ప్రతిపక్ష ‘ఇండియా బ్లాక్‌’ లోక్‌తంత్ర  బచావో ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 400ను దాటేందుకు ప్రధాని ఇప్పటికే అంపైర్లను ఎన్నుకొన్నారని అన్నారు. ‘‘ఐపీఎల్‌ మ్యాచ్లు జరుగుతున్నాయి. అంపైర్లపై ఒత్తిడి చేసి.. ఆటగాళ్లను కొనుగోలు చేసి.. కెప్టెన్లను బెదిరించి మ్యాచ్‌లు గెలవవచ్చు. దీనిని క్రికెట్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అంటారు. మన ఎదుట లోక్‌సభ ఎన్నికలు ఉన్నాయి. అంపైర్లను ప్రధాని మోదీ ఎన్నుకొన్నారు. మ్యాచ్‌కు ముందే మా జట్టులోని ఇద్దరు ఆటగాళ్లను అరెస్టు చేశారు. ఈవీఎంలు, మ్యాచ్‌ ఫిక్సింగ్‌, సోషల్‌ మీడియా, పత్రికలపై ఒత్తిడి లేకుండా వారు 180కి మించి స్థానాలు గెలవడం అసాధ్యం. 

కాంగ్రెస్‌ అతిపెద్ద ప్రతిపక్షం. ఎన్నికల సన్నాహాల మధ్యలో  పార్టీ బ్యాంక్‌ ఖాతాలను స్తంభింపజేశారు. మేము ప్రచారం చేయాలి. కార్యకర్తలను రాష్ట్రాలకు పంపాలి, పోస్టర్లు అంటించాలి. మరోవైపు మా ఖాతాలు నిలిచి పోయాయి. ఇవేం ఎన్నికలు’’ అని రాహుల్‌ మండిపడ్డారు. 

  • కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ ‘‘ఇది భిన్నత్వంలో ఏకత్వానికి వేదిక. అందుకే మా పార్టీలు మొత్తం కలిసి ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాయి. ప్రతిపక్షాల్లో ఐకమత్యం పెంచడమే ఈ కార్యక్రమం లక్ష్యం. మోదీని పదవి నుంచి మేము దించే వరకు దేశం సుసంపన్నం కాదు’’ అని వ్యాఖ్యానించారు. 
  •  సీపీఐ-ఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ ‘‘భారత రాజకీయాల్లో సరికొత్త శక్తి నేడు పుట్టింది. దేశ రాజ్యాంగం, గణతంత్ర భావాన్ని రక్షించడమే నిజమైన స్వాతంత్ర్యం. మేము దానిని సాధిస్తాం. అవినీతి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం నుంచి విముక్తి కల్పిస్తాం’’ అని పేర్కొన్నారు. 
  •  పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌ మాట్లాడుతూ ‘‘భాజపా ప్రభుత్వం స్కూళ్లు, ఆస్పత్రులు నిర్మించిన వారిని జైళ్లలో వేసింది. కాంగ్రెస్‌ నిధులను స్తంభింపజేసింది. వారిని వారు ఏమనుకొంటున్నారు. హేమంత్‌ సోరెన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌ను కారాగారంలో బంధించింది. ఇంటికి మీరు యజమానులా..? కాదు.. 140 కోట్ల మంది ప్రజలది ఈ ఇల్లు’’ అని పేర్కొన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని