Rajnath singh: అప్పుడు అరెస్టు చేయమన్నారు.. ఇప్పుడు అరెస్టు చేస్తే ప్రశ్నిస్తున్నారు..

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌పై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విమర్శలు చేశారు. ఇటీవల మంత్రి సెంథిల్‌బాలాజీని ఈడీ అరెస్టు వ్యవహారంలో ద్వంద్వ వైఖరి పాటించారని మండిపడ్డారు.

Published : 21 Jun 2023 01:48 IST

చెన్నై: మనీలాండరింగ్‌ కేసులో ఇటీవల అరెస్టయిన  తమిళనాడు మంత్రి సెంథిల్‌ బాలాజీ  విషయంలో సీఎం స్టాలిన్‌ ద్వంద్వ వైఖరి అనుసరించారని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విమర్శించారు.  రాష్ట్రంలో భాజపా శ్రేణుల అరెస్టు రాజ్యాంగ విరుద్ధమన్నారు. ప్రధాని మోదీ సారథ్యంలోని ఎన్డీయే సర్కార్‌కు తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా తాంబరంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజ్‌నాథ్‌సింగ్‌ మాట్లాడారు. తమిళనాట భాజపా, అన్నాడీఎంకే మధ్య సంబంధాలు దెబ్బతింటున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భాజపా తన భాగస్వామ్య పార్టీలకు విలువ ఇస్తుందన్నారు. తమ పార్టీ సారథ్యంలోని ఎన్డీయే నిర్బంధంతో కాదు.. నిబద్ధతతో కూడినదన్నారు. సీఎం పేరునుద్దేశిస్తూ రష్యా నియంత జోసెఫ్‌ స్టాలిన్‌ పేరును ప్రస్తావించిన రాజ్‌నాథ్‌ సింగ్‌.. ఆ పేరును సీరియస్‌గా తీసుకున్నట్టున్నారని.. ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారంటూ వ్యాఖ్యానించారు.  ఈ నేపథ్యంలో తమిళనాడులో ప్రజాస్వామ్యం వర్థిల్లాలని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేయదలచుకున్నట్టు చెప్పారు. 

గతంలో సెంథిల్‌ బాలాజీని స్టాలిన్‌ అవినీతి పరుడని ఆరోపించారని.. అరెస్టు చేయాలని కూడా డిమాండ్‌ చేశారన్నారు. కానీ ఇప్పడు ఆయన డీఎంకేలో చేరిన తర్వాత ఈడీ అరెస్టు చేస్తే మాత్రం ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ద్వంద్వ వైఖరి ఆమోదయోగ్యం కాదన్నారు. భాజపా రాష్ట్ర కార్యదర్శి ఎస్‌జీ సూర్యను అరెస్టు చేయడంపై రాజ్‌నాథ్‌ స్పందించారు. ఆయన అరెస్టు చట్టవిరుద్ధమన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని