Ravi Shankar Prasad: రాహుల్‌జీ.. ఇప్పటికైనా పగటి కలలు కనడం మానండి: రవిశంకర్‌

కాంగ్రెస్‌ పార్టీ (Congress) ఇప్పటికైనా పగటి కలలు కనడం మానుకోవాలని భాజపా సీనియర్‌ నేత రవిశంకర్‌ ప్రసాద్‌ హితవు పలికారు.

Published : 02 Jun 2024 19:54 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి (India Bloc) 295 స్థానాల్లో విజయం సాధించబోతోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) చెప్పడంపై భాజపా సీనియర్‌ నేత రవి శంకర్‌ ప్రసాద్‌ (Ravi Shankar Prasad) స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీ (Congress) ఇప్పటికైనా పగటి కలలు కనడం మానుకోవాలని హితవు పలికారు. ప్రధాని నరేంద్ర మోదీని కించపరచడమే పనిగా పెట్టుకోకుండా క్షేత్ర స్థాయిలో పని చేస్తే ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునే అవకాశముందని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఎన్డీయే కూటమి 400కు పైగా స్థానాలు సాధిస్తుందని, బిహార్‌లో 40 సీట్లను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రవిశంకర్‌ ప్రసాద్‌ బిహార్‌లోని పట్నా సాహిబ్‌ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.

దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ఎప్పుడూ పేద ప్రజల అభ్యున్నతి కోసమే పరితపిస్తారన్నారు. మోదీ ఆలోచనలెప్పుడూ రైతుల సమస్యలు, దేశాభివృద్ధి చుట్టూనే తిరుగుతాయంటూ.. ఆయన్ని దేశ రక్షకుడిగా అభివర్ణించారు. రాహుల్‌ గాంధీ, జైరాం రమేశ్‌ లాంటి నేతలు ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకొని క్షేత్ర స్థాయిలో పని చేయాలని సూచించారు.

శనివారం విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌.. మోదీ మీడియా పోల్స్‌ అంటూ రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘ మీరంతా సిద్దూ మూసేవాలా ‘295’ పాట వినే ఉంటారు. కచ్చితంగా మేం అన్ని సీట్లు సాధించబోతున్నాం. ఎన్డీయే కూటమికి 400కు పైగా సీట్లు వస్తాయన్న అంచనాలన్నీ తలకిందులవడం ఖాయం’’ అని అన్నారు. మరోవైపు దాదాపు అన్ని సర్వే సంస్థలు ఎన్డీయే కూటమే విజయం సాధిస్తుందని అంచనాలు వెలువరించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని