BJP: డబుల్‌ ఇంజిన్‌ ఎందుకు మొరాయించింది: యూపీలో భాజపా ఎదురీతకు కారణాలు

యూపీలో పార్టీలో నెలకొన్న గందరగోళాన్ని సకాలంలో పరిష్కరించకపోవడం.. వ్యూహ లోపాలే భాజపాను దెబ్బతీశాయని పార్టీ వర్గాలు అంతర్మధనానికి లోనవుతున్నాయి. 

Updated : 05 Jun 2024 12:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భాజపా (BJP) తరచూ చెప్పే డబుల్‌ ఇంజిన్‌ సర్కారుకు మోడల్‌ యూపీ. ఇక్కడ మోదీ-యోగి ద్వయం రాష్ట్రాన్ని ముందుకుతీసుకెళుతోందని పేర్కొంటారు. శాంతిభద్రతలు, అభివృద్ధి, హిందుత్వ అజెండాతో ముందుకెళుతున్నామని కమలం పార్టీ ప్రచారంలో చెప్పుకొంది. కానీ, ఈసారి ఎన్నికల్లో డబుల్‌ ఇంజిన్‌ మొరాయించి ఫలితాలు ఇవ్వలేదు. తప్పు ఎక్కడ జరిగిందనే అంశంపై ఇప్పుడు కమలనాధుల్లో అంతర్మధనం మొదలైంది. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ బలమైన సోషల్‌ ఇంజినీరింగ్‌తో ఈసారి ఎన్నికలకు సిద్ధమైంది. ఈ క్రమంలో ‘పీడీఏ’ (వెనుకబడిన, మైనార్టీ, దళిత్‌) వ్యూహంతో ఆ వర్గాల ఓటర్లను ఆకర్షించింది. 

రాష్ట్రంలో నాలుగు ఎన్నికల్లో విజయానికి యోగి నేతృత్వం వహించారు. 2022 అసెంబ్లీ, 2019 లోక్‌సభ, రెండు స్థానికసంస్థల ఎన్నికలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటిల్లో భాజపా విజయాలు సాధించింది. ఈసారి టికెట్ల కేటాయింపుల్లో అభ్యర్థులపై స్థానిక వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకోలేదనే విమర్శలూ ఉన్నాయి. రాష్ట్రంలో పార్టీ ఓటమికి అదే బలమైన కారణంగా నిలిచింది. యోగి ఆదిత్యనాధ్‌ మాత్రం టికెట్ల కేటాయింపును పూర్తిగా కేంద్ర నాయకత్వానికే వదిలేసినట్లు తెలుస్తోంది. కాకపోతే ప్రచార బాధ్యత యోగి తీసుకొన్నారు. ఆయన రాష్ట్రంలో, బయట 170 ర్యాలీలు నిర్వహించడంతోపాటు.. రాష్ట్రంలోని 75 జిల్లాల్లో పర్యటించారు. 

యోగిపై ప్రచారాన్ని బలంగా కౌంటర్‌ చేయలేకపోవడం..

భాజపా అభిమానుల్లో ఇష్టమైన సీఎంగా యోగికి పేరుంది. ఈ క్రమంలో పార్టీలో గందరగోళం సృష్టించేందుకు ప్రత్యర్థులు చేసిన ప్రయత్నాలను బలంగా తిప్పికొట్టలేకపోవడం కూడా సీట్లు కోల్పోవడానికి కారణమైంది. ఎన్నికల మధ్యలో దిల్లీ సీఎం లఖ్‌నవూ వచ్చిన వేళ.. ‘భాజపా గెలిచిన తర్వాత.. యోగిని కూడా ఇతర సీఎంల్లానే తొలగిస్తుంది’ అని పేర్కొన్నారు. మీరు కాషాయదళానికి ఓటేస్తే మీ అభిమాన ముఖ్యమంత్రిని వదులుకొంటారు అంటూ ప్రచారం జరిగింది. ఇది పార్టీ శ్రేణుల్లో గందరగోళానికి దారితీసింది. దీనికి భాజపా నుంచి గట్టి కౌంటర్‌ రాలేదు. ఇది కూడా కొంత నష్టం చేకూర్చిందని నాయకత్వం భావిస్తోంది. 

స్థానిక అంశాలు..

రైతులపై ఆర్థిక ఒత్తిడి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్య, అగ్నివీర్‌పై ప్రతిపక్ష ప్రచారం వంటి అంశాలను చాలాచోట్ల భాజపాకు వ్యతిరేకతను తెచ్చాయి. 

మైనార్టీ ఓట్ల ఏకీకరణ..

యూపీలో ఈసారి మైనార్టీ ఓట్లు గంపగుత్తగా ప్రతిపక్ష పార్టీలకు పడ్డట్లు ట్రెండ్స్ చెబుతున్నాయి. సుమారు 85 శాతం ముస్లింలు కాంగ్రెస్‌-సమాజ్‌వాదీ పార్టీకి ఓటు వేయగా.. ఆరు శాతం మాత్రమే భాజపా వైపు ఉన్నారు. దీనికి ప్రతిగా తమకు మద్దతున్న వర్గాల ఓట్లను ఏకీకరణ చేయడంలో భాజపా విఫలమైంది. 

అయోధ్యలోనే ఓటమి..

రామాలయం నిర్మించిన అయోధ్యలో (ఫైజాబాద్‌)లో భాజపా ఓడిపోవడాన్ని పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. భాజపాకు జీవం పోసిన అయోధ్య ఉద్యమానికి ఓ సానుకూల ముగింపు ఇచ్చినా.. ఎస్పీ అభ్యర్థి అవధేష్‌ ప్రసాద్‌నే విజయం వరించింది. దీంతో ఈ అంశం తమకు ఎన్నికల్లో ఉపయోగపడలేదని పార్టీ అంచనా వేసింది. 

మాయావతి బలహీన పడటం..

యూపీలో బీఎస్పీ బలహీనపడటం కూడా కాంగ్రెస్‌-సమాజ్‌వాదీకి కలిసొచ్చింది. 2014లో బీఎస్పీకి సీట్లు రాకపోయినా.. 2019లో పుంజుకొని 10 చోట్ల విజయం సాధించింది. అప్పట్లో సమాజ్‌వాదీ పార్టీతో జట్టు కట్టింది. కానీ, ఈసారి సొంతంగా బరిలో నిలవడంతో గతంలో వచ్చిన 19 శాతం ఓట్లను నిలబెట్టుకోలేక సింగిల్‌ డిజిట్‌కు పరిమితమైంది. రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్‌-సమాజ్‌వాదీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాయి. ఫలితంగా బీఎస్పీ ఓట్లు వాటికి మళ్లాయి. దీంతో రాష్ట్రంలో ఇండియా కూటమి ఓట్లశాతం 40శాతానికి చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని