Revanth Reddy: ఎలాపడితే అలా మాట్లాడితే.. జైల్లో పెడతాం: రేవంత్‌

లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Updated : 06 Apr 2024 22:28 IST

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Eelections) ఇండియా కూటమిని గెలిపించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. జూన్‌ 9న దిల్లీలో మువ్వన్నెల జెండా ఎగరాలన్నారు. హైదరాబాద్‌ తుక్కుగూడలో నిర్వహించిన ‘ కాంగ్రెస్‌ జనజాతర’ సభలో ఆయన ప్రసంగించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో భారాసను తుక్కుతుక్కుగా ఎలా ఓడించామో.. కేంద్రంలో భాజపానూ అలాగే ఓడించాలన్నారు. కార్యకర్తలు సైనికుల్లా పోరాడాలని కోరారు. కార్యకర్తల కష్టం వల్లే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు.

‘‘ గుజరాత్‌ మోడల్‌పై ‘వైబ్రెంట్‌ తెలంగాణ’ ఆధిపత్యం చూపిస్తోంది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారు. పదేళ్లలో మోదీ 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతులు 17 నెలలు పోరాడారు. ఈ క్రమంలో 750 మంది చనిపోయారు. బాధిత కుటుంబాలను మోదీ పరామర్శించలేదు.

కేసీఆర్‌ పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారు. పదేళ్లలో వందేళ్ల విధ్వంసం సృష్టించారు. ఏం మాట్లాడినా చూస్తూ ఊరుకుంటా అని కేసీఆర్‌ అనుకుంటున్నారు. అలా ఊరుకోవడానికి నేను జానారెడ్డిని కాదు.. రేవంత్‌రెడ్డిని. ఎలాబడితే అలా మాట్లాడితే కేసీఆర్‌ను జైలులో పెడతాం. ఆయనకు చర్లపల్లి జైల్లో డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇల్లు కట్టిస్తాం. ఆయన కాలు విరిగింది. కూతురు జైలుకెళ్లారని జాలి చూపించాం. దిల్లీ నుంచి రాష్ట్రానికి నిధులు కావాలంటే.. 14 మంది ఎంపీలను గెలిపించండి’’ అని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని