Lok Sabha polls: పంట పొలాల్లో దిగుతూ.. పతుల గెలుపు కోసం సతుల పాట్లు!

సంపన్న వర్గాలకు చెందిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, మరొకరు మాజీ సీఎం కుమారుడు నకుల్‌నాథ్‌..  వీరి విజయం కోసం వారి జీవిత భాగస్వాములు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

Published : 08 Apr 2024 17:48 IST

భోపాల్‌: ఎన్నికల్లో (Lok Sabha Elections) గెలుపే లక్ష్యంగా అభ్యర్థులే కాకుండా వారి కుటుంబీకులూ ప్రచారంలో తలమునకలయ్యారు. మధ్యప్రదేశ్‌లో ప్రత్యర్థి పార్టీలకు చెందిన ఇద్దరు అగ్రనేతల సతీమణులు ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. స్థానికుల సమస్యలు వింటూ, గొంతు కలుపుతూ, భజనలు చేస్తూ.. వారితో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. పంట పొలాల్లోకి దిగి మహిళా రైతులతో చేయిచేయీ కలుపుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వారే కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia), మాజీ సీఎం కుమారుడు నకుల్‌నాథ్‌ (Nakul Nath) సతీమణులు. సంపన్న వర్గాలకు చెందిన ఈ నేతలు.. తమ విజయం కోసం జీవిత భాగస్వాములతో పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

తొలి ఓటమి నుంచి బయటపడేందుకు..

పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా క్రితం ఎన్నికల్లో గుణ లోక్‌సభ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో జ్యోతిరాదిత్య భార్య ప్రియదర్శిని రాజే (Priyadarshini Raje) సింధియా.. నియోజకవర్గంలో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. గైక్వాడ్‌ రాజకుటుంబం నుంచి వచ్చిన ఆమె.. స్థానికంగా మార్కెట్లు ఇతర ప్రాంతాల్లో కలియతిరుగుతూ.. ప్రజలపై గ్వాలియర్‌ మహరాజ్‌ ఎంతో శ్రద్ధ చూపిస్తారంటూ ఓటర్లకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కొవిడ్‌ సమయంలో స్థానికుల కోసం చేసిన సేవలను గుర్తుచేస్తున్నారు.

‘పట్టు’వదలకుండా..

కాంగ్రెస్‌ నేత, సిట్టింగ్‌ ఎంపీ నకుల్‌నాథ్‌.. లోక్‌సభలో అడుగుపెట్టిన సంపన్న వ్యక్తుల్లో ఒకరు. రూ.697 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించిన ఆయన.. 2019లో లోక్‌సభలో ఉన్న 475 కోటీశ్వరుల్లో అగ్రస్థానంలో నిలిచారు. ఛింద్వాడా లోక్‌సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న నకుల్‌ తరఫున ఆయన భార్య ప్రియానాథ్‌ (Priya Nath) కూడా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈక్రమంలో చోరై ప్రాంతంలో ఒకచోట మహిళా రైతు కూలీలతో చేయిచేయీ కలిపి పంటను కోస్తున్నట్లు దృశ్యాలు కనిపించాయి. అంతేకాకుండా నావేగావ్‌ గ్రామ మహిళలతో కలిసి భక్తిగీతాలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. తన మామ కమల్‌నాథ్‌ సన్నిహితులు ఇటీవల భాజపాలో చేరడంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

కంచుకోటలో పోటాపోటీ..

ఛింద్వాడా, గుణ.. నియోజకవర్గాలు ఇరు కుటుంబాలకు కంచుకోటగా ఉన్నాయి. దశాబ్దాల కాలంగా వీరిదే ఆధిపత్యం. ఒకసారి మినహా 1980 నుంచి ఛింద్వాడా నాథ్‌ కుటుంబానిదే గెలుపు. 1997లో మాజీ సీఎం సుందర్‌లాల్‌ పట్వా చేతిలో కమల్‌నాథ్‌ ఓడిపోయారు. ఈసారి నకుల్‌నాథ్‌ను కాంగ్రెస్‌ ఇక్కడినుంచి పోటీలో నిలిపింది. గుణ నియోజకవర్గం అంటేనే సింధియా గుర్తొస్తుంది. ఈ కుటుంబానికి చెందిన నేతలు ఇక్కడి నుంచి 14సార్లు విజయం సాధించారు. 2002 నుంచి 2014 వరకు మూడుసార్లు ఇక్కడినుంచి గెలిచిన జ్యోతిరాదిత్య సింధియా.. 2019లో (కాంగ్రెస్‌) తొలిసారి ఓటమిని చవిచూశారు. ఈసారి భాజపా తరఫున పోటీలో ఉన్నారు.

మధ్యప్రదేశ్‌లో సంపన్నవర్గాలకు చెందిన నేతల ఎన్నికల ప్రచార తీరుపై భోపాల్‌కు చెందిన సీనియర్‌ జర్నలిస్ట్‌ శ్రావణి సర్కార్‌ మీడియాతో మాట్లాడుతూ.. గత దశాబ్దంలో ఎన్నికల ముఖచిత్రం పూర్తిగా మారిందన్నారు. గతంలో మాదిరిగా ఉన్నతవర్గాలకే ఓటర్లు జై కొట్టడం లేదని.. సామాన్యులకు అందుబాటులో ఉండే స్వభావాన్నే కోరుకుంటున్నారన్నారు. ఈసారి మాత్రం జ్యోతిరాదిత్య సింధియా, నకుల్‌నాథ్‌ ఇద్దరికీ ఈ ఎన్నికలు కఠినంగానే కనిపిస్తున్నాయని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని