Sachin Pilot: 15 రోజుల్లోగా చర్యలు తీసుకోలేదో.. గహ్లోత్‌కు పైలట్‌ అల్టిమేటం

అవినీతి, ప్రభుత్వ ఉద్యోగుల నియామక పరీక్ష పత్రాల లీకేజీ అంశాలపై 15 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని రాజస్థాన్‌ కాంగ్రెస్‌ నేత సచిన్ పైలట్‌ (Sachin Pilot) అల్టిమేటం ఇచ్చారు. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని సొంత ప్రభుత్వాన్నే హెచ్చరించారు.

Published : 15 May 2023 18:07 IST

జైపుర్‌: అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజస్థాన్‌ కాంగ్రెస్‌ (Rajasthan)లో అంతర్గత విభేదాలు నానాటికీ తీవ్రమవుతుండటం ఆ పార్టీకి తలనొప్పిగా మారుతోంది. ఇప్పటికే సీఎం అశోక్‌ గహ్లోత్‌పై పలు మార్లు విమర్శలు చేసిన కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌ (Sachin Pilot).. సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాదయాత్ర చేపట్టారు. తాజాగా గహ్లోత్‌ (Ashok Gehlot) సర్కారుకు పైలట్‌ ఓ అల్టిమేటం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వాల అవినీతిపై 15 రోజుల్లోగా చర్యలు చేపట్టకపోతే తన ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తానని పైలట్‌ హెచ్చరించారు.

అవినీతి, ప్రభుత్వ ఉద్యోగుల నియామక పరీక్ష పత్రాల లీకేజీ అంశాలపై సచిన్‌ పైలట్‌ (Sachin Pilot) చేపట్టిన ఐదు రోజుల ‘జన్‌ సంఘర్ష్‌ యాత్ర’ నేటితో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘అవినీతికి వ్యతిరేకంగా నేను, సీఎం గహ్లోత్‌ (Ashok Gehlot ) పోరాడాం. కానీ ఇప్పుడు ఆయన ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. భాజపా నేత, మాజీ సీఎం వసుంధరా రాజే హయాంలో జరిగిన అవినీతి ఆరోపణలపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టాలి. ప్రస్తతమున్న రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను రద్దు చేసి.. కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. పేపర్‌ లీకేజీ కారణంగా నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలి. 15 రోజుల్లోగా గహ్లోత్ సర్కారు ఈ డిమాండ్లను పరిష్కరించాలి. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉద్ధృతం చేస్తా’’ అని పైలట్ హెచ్చరించారు. ఎలాంటి పరిణామాలకు తాను భయపడబోనని, చివరి శ్వాస వరకు ప్రజల కోసమే పోరాడుతానని ఆయన తెలిపారు. 

గత కొంత కాలంగా రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌, సచిన్‌ పైలట్‌ మధ్య విభేదాలు తరచూ బయటపడుతున్నాయి. వసుంధర రాజే హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలంటూ ఆ మధ్య పైలట్ ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల రాజేపై గహ్లోత్‌ ప్రశంసలు కురిపించడం ఈ విభేదాలను మరింత పెంచింది. రాజే తన ప్రభుత్వాన్ని కాపాడారని సీఎం గహ్లోత్‌ వ్యాఖ్యానించగా.. ఆమెను గహ్లోత్‌ తన నాయకురాలిగా భావిస్తున్నారంటూ పైలట్‌ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పాదయాత్ర చేపట్టడం గమనార్హం. కాగా.. పైలట్‌ యాత్రకు కాంగ్రెస్‌ (Congress) దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. యాత్ర పూర్తిగా ఆయన వ్యక్తిగతమని, పార్టీతో ఎలాంటి సంబంధంలేదని రాజస్థాన్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పీసీసీ) స్పష్టంచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని