Sajjala: రూల్‌ కాదేమో అని వెనక్కి తగ్గేవారు ఏజెంట్లుగా వద్దు: సజ్జల

‘రూల్‌ కాదేమో అని వెనక్కి తగ్గేవారు కౌంటింగ్‌ ఏజెంట్లుగా వద్దు’ అని వైకాపా ప్రధాన కార్యదర్శి, రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పార్టీ చీఫ్‌ కౌంటింగ్‌ ఏజెంట్లకు స్పష్టం చేశారు.

Updated : 30 May 2024 08:34 IST

ఈనాడు, అమరావతి: ‘రూల్‌ కాదేమో అని వెనక్కి తగ్గేవారు కౌంటింగ్‌ ఏజెంట్లుగా వద్దు’ అని వైకాపా ప్రధాన కార్యదర్శి, రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పార్టీ చీఫ్‌ కౌంటింగ్‌ ఏజెంట్లకు స్పష్టం చేశారు. ‘మన టార్గెట్‌ ఇదీ అని దృష్టిలో పెట్టుకుని... దానికి అవసరమైనవి తెలుసుకోవాలి. అవతలివారు (ప్రత్యర్థి పార్టీలను ఉద్దేశించి) అడ్డం పడకుండా వారిని ఆపేందుకు ఏవేం నిబంధనలు ఉన్నాయో చూసుకోవాలి. మనవి ఒక్క ఓటు కూడా చెల్లనివిగా చేసే పరిస్థితి రాకుండా అడ్డుకునేందుకు ఏం చేయాలో చూసుకోవాలి. అంతే తప్ప రూల్‌ అలా ఉంది కాబట్టి దాని ప్రకారం పోదాం అని మనం కూర్చోకూడదు. మనకు అనుకూలంగా, అవతలివాళ్ల ఆటలు సాగకుండా రూల్‌ని ఎలా చూసుకోవాలి? అవసరమైతే దానికోసం ఎంతవరకు ఫైట్‌ చేయాలనేది నేర్చుకుందాం. ఇందులో కౌంటింగ్‌ ఏజెంట్‌ తనవంతు పాత్ర పోషించేలా వారి మెదడులోకి మీరు (చీఫ్‌ కౌంటింగ్‌ ఏజెంట్లు) బాగా ఎక్కించాలి. పొరపాటున ఒకటి మనం వాదించినా పర్లేదు. కానీ, రూల్‌ కాదేమో అని వెనక్కి తగ్గేవాడైతే ఏజెంట్‌గా వద్దు’ అని పునరుద్ఘాటించారు.

వైకాపా కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆ పార్టీ చీఫ్‌ కౌంటింగ్‌ ఏజెంట్ల అవగాహన సదస్సులో సజ్జల పాల్గొని మాట్లాడారు. ‘అవతల మన ప్రత్యర్థి ధర్మయుద్ధం చేసేవారు కాదు. వారికి తెలిసిన విద్య అడ్డం పడటం. అది ఈసీ రూపంలో కావచ్చు, ఇంకోటి కావచ్చు గమనిస్తూనే ఉన్నాం. వారి ఆటలు సాగనివ్వకుండా ఎలా చేయాలనేదే మన టార్గెట్‌. మళ్లీ బ్రహ్మాండంగా అధికారంలోకి వస్తున్నాం. 9న ప్రమాణస్వీకారం ఉంటుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే అవతలివారి ఆటలను సాగనిచ్చి, వాళ్లు మానసికంగా చేసే ప్రచారానికి మనం బెంబేలెత్తకుండా ముందుగానే వారి ఆటలు సాగకుండా చేసేందుకు మరింత అప్రమత్తంగా ఉంటున్నాం’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని