I.N.D.I.A: త్వరలోనే ‘ఇండియా’ కూటమి భేటీ.. ప్రధాన అజెండా ఇదే!

లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఇండియా కూటమి సీట్ల పంపకాలపై అంశాన్ని త్వరగా తేల్చాలంటూ పలు పార్టీలు ఒత్తిడి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే కూటమి నేతలు భేటీ కానున్నారు.

Published : 07 Dec 2023 20:59 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు త్వరలోనే భేటీ కానున్నారు. ఈ కీలక భేటీ డిసెంబర్‌ 17, 20 తేదీల్లో ఉండే అవకాశం ఉన్నట్లు కనబడుతోంది. కూటమిలోని పార్టీల ముఖ్య నేతలు పాల్గొనే ఈ భేటీలో సీట్ల పంపకాలు అంశాన్ని ప్రధాన అజెండాగా చర్చించనున్నట్లు సమాచారం. దేశ రాజధాని దిల్లీలో బుధవారం జరగాల్సిన విపక్ష  ‘ఇండియా’ కూటమి నేతల భేటీ వాయిదా పడిన విషయం తెలిసిందే.  అయితే, ‘ఇండియా’ కూటమి తదుపరి భేటీకి కచ్చితమైన తేదీలు ఇంకా ఖరారు కానప్పటికీ డిసెంబర్‌ మూడో వారంలో మాత్రం జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. డిసెంబర్‌ 17న సమావేశం కానున్నట్లు ఇటీవల ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూడా చెప్పడం గమనార్హం.

లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ సీట్ల పంపకాలు అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని పలు పార్టీల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. అలాగైతే.. అభ్యర్థులకు ప్రచారానికి తగినంత సమయం దొరుకుతుందని, క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేయవచ్చని పేర్కొంటున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఇటీవల నిర్వహించిన సమావేశంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు సీట్ల పంపకాల అంశాన్ని లేవనెత్తారు.  వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోని భాజపా ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో ప్రతిపక్షాలన్నీ ఏకమై ఇండియా కూటమిగా ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ కూటమి చివరి సమావేశం ఆగస్టు 31, సెప్టెంబర్‌ 1 తేదీల్లో ముంబయిలో జరిగింది. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సెప్టెంబర్‌ 13న దిల్లీలో భేటీ అయింది. సీట్ల పంపకాలపై త్వరగా తేల్చాలంటూ వస్తోన్న ఒత్తిళ్ల నేపథ్యంలో తాజాగా జరగబోయే భేటీలో ఆ అంశంపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని