Gujarat Election 2022: ప్రచారానికే వెళ్లలేదు..నేనెలా సమాధానం చెప్పగలను: శశిథరూర్‌

గుజరాత్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో.. ఆ పార్టీ సీనియర్‌ నేత శశి థరూర్‌ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.తాను ప్రచారానికి వెళ్లలేదని, అక్కడి పరిస్థితులు తనకెలా తెలుస్తాయని ఆయన మీడియాకు బదులిచ్చారు.

Published : 09 Dec 2022 01:38 IST

దిల్లీ: గుజరాత్‌లో కాంగ్రెస్‌ ఘోర పరాజయం పాలైంది. కేవలం 17 స్థానాలకే పరిమితమైంది.ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ స్పందన చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సీనియర్‌ నేతల అభిప్రాయం అడిగినప్పుడు.. పార్టీకి అనుకూలంగానే స్పందిస్తారు. కానీ, శశి థరూర్‌ మాత్రం ‘నేను ప్రచారానికి వెళ్లలేదు కదా.. అక్కడ పరిస్థితి గురించి నాకేం తెలుస్తుంది’ అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ‘‘నేను ప్రచారానికి వెళ్లలేదు. ప్రచారానికి వెళ్లే వాళ్ల జాబితాలోనూ నా పేరు లేదు. అందుకే మీ ప్రశ్నకు సమాధానం చెప్పలేను’’ అని ఆయన వ్యాఖ్యానించారు. 

అధిష్ఠానం మాటను తోసిరాజని ఇటీవల పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయడంపై కాంగ్రెస్‌ అతడిపై గుర్రుగా ఉందనడం కాదనలేని వాస్తవం. ఈ క్రమంలోనే హిమాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి అతడిని దూరం పెట్టింది. స్టార్‌ క్యాంపైనర్ల జాబితాలో ఆయనకు స్థానం కల్పించలేదు. దీంతో అందరు ఎంపీల మాదిరిగానే ఇవాళ్టి పార్లమెంట్‌ సమావేశాలకు హాజరైన ఆయన కాంగ్రెస్‌పై తనకున్న వ్యతిరేకతను పరోక్షంగా బయటపెట్టారు. అయితే, ఈసారి ఆప్‌ రూపంలో కాంగ్రెస్‌కు భారీ గండి కొట్టిందన్నారు. కేవలం 5స్థానాలకే పరిమితమైన ఆప్‌ పార్టీ అంచనాలను అందుకోలేక పోయిందని చెప్పారు. దీనిని బట్టి రాష్ట్రంలో మళ్లీ క్రియాశీల పార్టీలు రెండే మిగిలినట్లయిందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు గుజరాత్‌లో అధికార భాజపా వరుసగా ఏడోసారి విజయం సాధించింది. 37 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ 156 స్థానాలను కైవసం చేసుకుంది. 1985లో 149 నియోజకవర్గాల్లో విజయం సాధించి కాంగ్రెస్‌ నెలకొల్పిన రికార్డును కమలనాథులు బద్దలుకొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని