Defamation Case: 40 శాతం కమీషన్‌ కేసులో సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లకు బెయిల్‌

పరువు నష్టం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లకు ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Published : 01 Jun 2024 17:13 IST

బెంగళూరు: పరువు నష్టం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah), ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లకు (DK Shivakumar) ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు  (MP/MLA Court)బెయిల్‌ మంజూరు చేసింది. గత భాజపా ప్రభుత్వం అభివృద్ధి పనుల్లో 40శాతం కమీషన్‌ వసూలుచేసినట్లు కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించిందని, అప్పటి ప్రభుత్వాన్ని ‘ 40 శాతం కమీషన్‌ ప్రభుత్వం’గా అభివర్ణిస్తూ పత్రికల్లో పెద్దఎత్తున ప్రకటనలు గుప్పించిందని పేర్కొంటూ భాజపా ప్రధాన కార్యదర్శి కేశవ్‌ ప్రసాద్‌ ఆ పార్టీ తరఫున గతంలో పరువు నష్టం దావా వేశారు. వివిధ రకాల ఉద్యోగాలకు భాజపా ‘రేటు కార్డులు’ పెట్టిందంటూ హస్తం పార్టీ పోస్టర్లు అతికించిందని, తద్వారా తమ పార్టీ పరువుకు భంగం కలిగించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

దీనిపై శనివారం విచారణ చేపట్టిన బెంగళూరులోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు సీఎం, డిప్యూటీ సీఎంలకు బెయిల్‌ మంజూరుచేసింది. ఈ కేసులో సహనిందితుడిగా ఉన్న రాహుల్‌గాంధీని కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. విచారణ అనంతరం సిద్దరామయ్య మాట్లాడుతూ.. చట్టాన్ని గౌరవిస్తూ కోర్టు ఎదుట ప్రత్యక్షంగా హాజరైనట్లు చెప్పారు.‘ ఇదో సివిల్‌ కేసు. చట్ట సంరక్షకుడిగా, దానిని గౌరవించే వ్యక్తిగా న్యాయమూర్తి ఎదుట హాజరయ్యాను. కేపీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీపైనా కేసు పెట్టారు. తదుపరి విచారణల్లో ప్రత్యక్ష హాజరు నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని కోరాం’’ అని అన్నారు. 

మరోవైపు భాజపా నేతలు ఇచ్చిన స్టేట్‌మెంట్ల ఆధారంగానే పత్రికల్లో ప్రకటనలు ఇచ్చినట్లు డీకే శివకుమార్‌ తెలిపారు. ఈ విషయాన్ని న్యాయస్థానంలోనూ ఛాలెంజ్‌ చేసినట్లు చెప్పారు. ఇలాంటి కేసులను ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసన్నారు. కర్ణాటకలో భాజపా హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో పెద్దఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. 40శాతం కమీషన్‌ కోసం ప్రజాప్రతినిధులు వేధింపులకు గురిచేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. ఇదే విషయాన్ని పేర్కొంటూ అప్పట్లో కర్ణాటక కాంట్రాక్టు అసోసియేషన్‌ ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైకి లేఖ రాయడం సంచలనం రేపింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇది తీవ్ర చర్చనీయాంశం కావడంతోపాటు ఎన్నికల్లోనూ ప్రచారాస్త్రంగా మారింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ దీనిపై భారీ ప్రకటనలు గుప్పించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు