‘హిమాచల్‌’లో కీలక పరిణామం.. భాజపాలోకి ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు

Himachal MLAs: హిమాచల్‌ ప్రదేశ్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అనర్హత వేటు పడిన ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు భాజపాలో చేరారు.

Published : 23 Mar 2024 14:37 IST

శిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అనర్హత వేటు పడిన ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలో (BJP) చేరారు. కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌ నేతృత్వంలో శనివారం పార్టీ కండువా కప్పుకొన్నారు. త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో వీరు కమలం గుర్తుపై పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ తన హామీల అమల్లో విఫలమైందని ఈసందర్భంగా అనురాగ్‌ ఠాకూర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ నేతలు భాజపాకు అనుకూలంగా ఓటేయడం.. ప్రజల్లో ఆగ్రహానికి నిదర్శమని చెప్పారు. భాజపాలో చేరిన వారిలో సుధీర్‌ శర్మ, రవి ఠాకూర్‌, రాజీందర్‌ రాణా, ఇందర్‌ దత్‌ లఖన్‌పాల్‌, చేతన్య శర్మ, దేవిందర్‌ కుమార్‌ భుట్టో ఉన్నారు.

గత నెల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వీరంతా పార్టీ విప్‌ను ధిక్కరించి భాజపాకు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ఫిబ్రవరి 29న వీరిపై స్పీకర్‌ అనర్హత వేటు వేశారు. వీరితో పాటు మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు సైతం తమ పదవులకు రాజీనామా చేశారు. వీరు కూడా త్వరలో భాజపాలో చేరనున్నారు. సార్వత్రిక ఎన్నికల కోసం ఇటీవల షెడ్యూల్‌ ప్రకటించిన ఎన్నికల సంఘం.. హిమాచల్‌ ప్రదేశ్‌లో అనర్హత వేటు పడిన ఆరు స్థానాల్లో ఉప ఎన్నిక చేపట్టేందుకు సిద్ధమైంది. ఇందుకు మే 7 నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుందని ప్రకటించింది. మరోవైపు ఎమ్మెల్యేలపై వేటుతో 62 సీట్లు ఉన్న అసెంబ్లీలో కాంగ్రెస్ సంఖ్యా బలం 39 నుంచి 33కు తగ్గింది. భాజపాకు 25 మంది సభ్యులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని