Assembly Elections: అరుణాచల్‌లో మళ్లీ భాజపా సర్కార్‌.. ఎస్‌కేఎందే సిక్కిం..

Assembly Elections: అరుణాచల్‌లో భాజపా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. సిక్కింలో ఎస్‌కేఎం హవా కొనసాగించి అధికారం నిలబెట్టుకుంది.

Updated : 02 Jun 2024 16:03 IST

ఇటానగర్‌: అరుణాచల్‌ ప్రదేశ్‌లో మళ్లీ భాజపానే అధికారం కైవసం చేసుకుంది. ఆ పార్టీ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 60 అసెంబ్లీ స్థానాలున్న ఆ రాష్ట్రంలో భాజపా 46 సీట్లలో గెలుపొందింది. వీటిలో 10 సీట్లు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. 50 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగ్గా.. భాజపా 36 స్థానాల్లో విజయం సాధించింది. (Arunachal Pradesh Assembly Election Results)

‘నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (NPP)’ ఐదు సీట్లు గెలుపొందింది. ‘పీపుల్స్‌ పార్టీ ఆఫ్ అరుణాచల్‌’ (PPA) రెండు, ఎన్సీపీ మూడు, కాంగ్రెస్‌ ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. స్వంత్రులు మూడు చోట్ల గెలుపొందడం గమనార్హం. 2019లో భాజపా అరుణాచల్‌లో 41 సీట్లు గెలుచుకొని అధికారం చేపట్టింది.

తుది ఫలితాలు ఇలా..

  • భాజపా - 46
  • ఎన్‌పీపీ - 05
  • ఎన్‌సీపీ - 03
  • పీపీఏ - 02
  • కాంగ్రెస్‌ - 01
  • స్వతంత్రులు - 03

ఎస్‌కేఎందే సిక్కిం..

సిక్కింలో ‘సిక్కిం క్రాంతికారీ మోర్చా (SKM)’ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. మెజార్టీ మార్కు 17 స్థానాలు కాగా.. ఆ పార్టీ ఏకంగా 31 స్థానాల్లో గెలుపొందడం విశేషం. ఓటర్లు దాదాపు ఏకపక్ష తీర్పునిచ్చారు. ముఖ్యమంత్రి ప్రేమ్‌ సింగ్‌ తమంగ్‌.. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ గెలుపొందారు. (Sikkim Assembly Election Results)

2019 వరకు అప్రతిహతంగా 25 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన ‘సిక్కిం డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ (SDF)’ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందింది. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌ పోటీ చేసిన రెండు నియోజవర్గాల్లోనూ ఓడిపోవడం గమనార్హం.

ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికల ఫలితాలు జూన్‌ 4నే వెలువడనున్నట్లు ఎన్నికల సంఘం తొలుత ప్రకటించింది. కానీ, నేటితో రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితి ముగుస్తుండటంతో కౌంటింగ్‌ను రెండు రోజుల ముందుకు జరిపింది.

తుది ఫలితాలు ఇలా..

  • ఎస్‌కేఎం - 31
  • ఎస్‌డీఎఫ్‌ - 01
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని