Bihar: బిహార్‌కు ప్రత్యేకహోదా!

ఎన్డీయేలో తెలుగుదేశంతోపాటు కీలక భాగస్వామ్య పక్షంగా మారిన జనతాదళ్‌-యునైటెడ్‌ (జేడీయూ).. భాజపా ముందు కీలక డిమాండ్లు ఉంచుతోంది! బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తాము దీర్ఘకాలంగా చేస్తున్న డిమాండ్‌ను మళ్లీ తెరమీదకు తెస్తోంది.

Updated : 07 Jun 2024 08:14 IST

కీలక డిమాండ్‌ను తెరమీదకు తెస్తున్న జేడీయూ
దేశవ్యాప్త కులగణనను కూడా కోరే అవకాశం

దిల్లీ, పట్నా: ఎన్డీయేలో తెలుగుదేశంతోపాటు కీలక భాగస్వామ్య పక్షంగా మారిన జనతాదళ్‌-యునైటెడ్‌ (జేడీయూ).. భాజపా ముందు కీలక డిమాండ్లు ఉంచుతోంది! బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తాము దీర్ఘకాలంగా చేస్తున్న డిమాండ్‌ను మళ్లీ తెరమీదకు తెస్తోంది. త్రివిధ దళాల్లో నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని సమీక్షించాలని, దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కోరుతోంది. జేడీయూ సీనియర్‌ నేత, బిహార్‌ మంత్రి విజయ్‌కుమార్‌ చౌధరీ పట్నాలో విలేకర్లతో మాట్లాడుతూ.. బిహార్‌ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. విభజన తర్వాత తమ రాష్ట్రానికి ఎదురైన సమస్యల నుంచి గట్టెక్కడం ప్రత్యేక హోదా లేకుండా సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ రాష్ట్ర సీఎం నీతీశ్‌కుమార్‌ దీర్ఘకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ ఆయన నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం నిరుడు ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది కూడా. అయితే 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల నేపథ్యంలో తాము ప్రత్యేక హోదా డిమాండ్లను పరిశీలించబోమని కేంద్రం గతంలో స్పష్టం చేసింది. 

భాజపాకు బేషరతుగానే మద్దతు 

జేడీయూ సీనియర్‌ నేత కె.సి.త్యాగి దిల్లీలో గురువారం విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో తమ పార్టీ భాజపాకు బేషరతుగా మద్దతిస్తోందని స్పష్టం చేశారు. అయితే అగ్నిపథ్‌పై ఓటర్లు ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. ఆ పథకంలోని లోపాలు తొలగిపోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకోసం అగ్నిపథ్‌ను సమీక్షించాలని డిమాండ్‌ చేశారు. 

యూసీసీకి వ్యతిరేకం కాదు 

ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)కి జేడీయూ వ్యతిరేకం కాదని త్యాగి అన్నారు. దాన్ని అమల్లోకి తీసుకొచ్చేముందు అన్ని వర్గాలు, ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి.. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నదే తమ అభిమతమని చెప్పారు. కులగణన తమ డిమాండ్లలో ఒకటిగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ సహా దేశంలో ఏ పార్టీ కూడా దాన్ని వ్యతిరేకించలేదని గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కులగణన చాలా అవసరమని పేర్కొన్నారు.


రైల్వే, వ్యవసాయ శాఖలపై ఆసక్తి 

కేంద్ర మంత్రివర్గంలో తమ పార్టీ గౌరవనీయ ప్రాతినిధ్యాన్ని ఆశిస్తున్నట్లు జేడీయూ నేత, బిహార్‌ మంత్రి శ్రవణ్‌ కుమార్‌ తెలిపారు. 2025లో జరగనున్న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మంత్రి పదవులను కేటాయించాలని అభిప్రాయపడ్డారు. కేంద్రంలో తమ పార్టీ మూడు మంత్రి పదవులు కోరే అవకాశముందని జేడీయూ సీనియర్‌ నాయకుడొకరు చెప్పారు. గ్రామీణాభివృద్ధి, రైల్వే, వ్యవసాయం, జలవనరులు, భారీ పరిశ్రమల వంటి శాఖలపై తమ పార్టీ ఆసక్తిగా ఉందని పేర్కొన్నారు. పార్టీ నుంచి రాజీవ్‌ రంజన్‌సింగ్‌ లలన్, కౌశలేంద్ర కుమార్, రామ్‌ప్రీత్‌ మండల్, లవ్లీ ఆనంద్, సంజయ్‌ ఝా మంత్రి పదవుల రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది.


అగ్నిపథ్‌ను సమీక్షించాల్సిందే: చిరాగ్‌ పాస్వాన్‌

అగ్నిపథ్‌ పథకాన్ని సమీక్షించాల్సిందేనని ఎల్‌జేపీ(రాంవిలాస్‌) అధ్యక్షుడు చిరాగ్‌ పాస్వాన్‌ కూడా ఓ వార్తాసంస్థతో ముఖాముఖిలో అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్త కులగణనకూ తమ పార్టీ అనుకూలమని పేర్కొన్నారు. కేంద్రంలో భాజపాకు తాము బేషరతుగానే మద్దతిస్తున్నట్లు స్పష్టం చేశారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు