Rajasthan Elections: భాజపా కంచుకోట ‘హాడౌతీ’.. ఈసారి ఎవరిదో?

రాజస్థాన్‌లోని హాడౌతీ ప్రాంతంపై భాజపా, కాంగ్రెస్‌ పార్టీలు కీలకంగా దృష్టి సారించాయి. ఈ ప్రాంతానికి ఎందుకంత ప్రాముఖ్యత? ఎవరి బలాలేంటి?

Updated : 19 Oct 2023 21:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హాడౌతీ (hadoti ).. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల (Rajasthan Assembly Elections) నేపథ్యంలో కాంగ్రెస్‌, భాజపాలు కీలకంగా దృష్టిసారించిన ప్రాంతం. ఒకప్పుడు భాజపాకి (BJP) కంచుకోటగా ఉన్న హాడౌతీ.. క్రమంగా హస్తం (Congress) పార్టీవైపు అడుగులేస్తోంది. ఈ ప్రాంతంలోని 17 నియోజకవర్గాల్లో 2018 ఎన్నికల్లో భాజపా 10 స్థానాలను కైవసం చేసుకోగా.. కాంగ్రెస్‌ 7 చోట్ల జయకేతనం ఎగురవేసింది. మొత్తం 200 సీట్లలో 17 స్థానాలు చిన్న సంఖ్యే అయినప్పటికీ.. పార్టీకి విజయావకాశాలు ఎంతమేర ఉన్నాయో ఇక్కడి ఫలితాలను బట్టి అంచనా వేయొచ్చు. అందుకే ఈ ప్రాంతంలో పూర్వ వైభవం పొందాలని భాజపా, మరిన్ని స్థానాలను సాధించి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ ఉవ్విళ్లూరుతున్నాయి.

4 జిల్లాల పరిధిలో..

హాడౌతీ ప్రాంతం నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉంది. కోటా, బూందీ, బారాం, ఝలవార్‌ జిల్లాల వ్యాప్తంగా 17 నియోజకవర్గాల పరిధిలో ఈ రీజియన్‌ ఉంటుంది. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన వెంటనే భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచారం కోసం ఇదే ప్రాంతానికి వెళ్లారంటే కమలదళం ఈ ప్రాంతానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాంత అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. అంతేకాకుండా పార్టీ కార్యకర్తలు, స్థానిక నేతలతో ప్రత్యేకంగా సమావేశమై.. బూత్‌ మేనేజ్‌మెంట్‌ గురించి వాళ్లకు సూచనలు సలహాలు అందించారు. పార్టీ విజయానికి పాటుపడాలని, పార్టీ ఉంటేనే మనమంతా ఉన్నామంటూ వాళ్లలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభావం..

హాడౌతీ ప్రాంతంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభావం చాలా ఎక్కువ. భాజపా అగ్రనేతలు ఎల్‌కే అడ్వాణీ, దివంగత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ఈ ప్రాంతంలో తరచూ పర్యటించేవాళ్లు. రాజస్థాన్‌కు తొలి కాంగ్రెసేతర సీఎం భైరాన్‌ సింగ్‌ షెఖావత్‌ ఈ ప్రాంతం నుంచి ఎన్నికైన వారే. 1977 ఉప ఎన్నికల్లో బారాం జిల్లాలోని ఛాబ్రా నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించారు. అంతేకాకుండా రాజస్థాన్‌ తొలి మహిళా ముఖ్యమంత్రి వసుంధరా రాజే కూడా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన వారే. జలరపటాన్‌ నియోజకవర్గం నుంచి ఆమె 4 సార్లు విజయం సాధించారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా మొత్తం 17స్థానాలకు గానూ 16చోట్ల విజయం సాధించిందంటే ఆ పార్టీ ఎంతగా వేళ్లూనుకుందో చెప్పొచ్చు. అంతకుముందు కూడా భాజపాకి ఆ ప్రాంతంపై పూర్తి పట్టుంది. కానీ, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ గాలి వీయడంతో భాజపా 10 స్థానాలకు పరిమితమైంది.

భాజపాపై తగ్గిన మోజు

ఒకప్పుడు భాజపా వైపు మొగ్గు చూపే ఈ ప్రాంత ఓటర్లు గత ఎన్నికల నుంచి ఆ పార్టీకి విముఖత చూపిస్తున్నారు. 2018 ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం. అలాగని అక్కడి వారంతా కాంగ్రెస్‌పై మోజు కనబరుస్తున్నారని చెప్పలేం. అయితే, ఈ రెండు పార్టీలను సరిపోల్చితే కాంగ్రెస్‌కే వీసమంతైనా మొగ్గు ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గ్రామీణ ఓటర్ల కాంగ్రెస్‌వైపు మొగ్గు చూసే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలే ఇందుకు కారణం కావొచ్చు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను విస్తృతంగా కల్పించింది. ఝలవార్‌ ప్రాంతంలో రోడ్డు మార్గాలను అభివృద్ధి చేసింది. అయితే, రైతులకు గిట్టుబాటుధర కల్పించడంలో గహ్లోత్‌ ప్రభుత్వం విఫలమైందనే వాదనలు ఉన్నాయి. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఈ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత 20 ఏళ్లుగా వరుస విజయాలు సాధిస్తున్నారు. అయినప్పటికీ, ఈ ప్రాంతంలో ఎయిర్‌పోర్టు తీసుకురాలేకపోవడం విమర్శలకు తావిస్తోంది. దీనిని కాంగ్రెస్‌ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది.

వ్యవసాయం వెనకంజ

ఎన్ని ప్రభుత్వాలు మారినా హాడౌతీ ప్రాంతంలో వ్యవసాయ దిగుబడులను పెంచే ప్రయత్నం చేయడం లేదు. ఝలావర్‌ ప్రాంతంలో ఎక్కువగా నారింజ పంటను పండిస్తారు. దీనికి ‘నాగ్‌పుర్‌ ఆఫ్‌ రాజస్థాన్‌’ అని కూడా పిలుస్తుంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ప్రాంతంలో వ్యవసాయ ప్రాసెసింగ్‌ యూనిట్లు లేకపోవడంపై ఇరు పార్టీలపైనా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజా ఎన్నికల నేపథ్యంలో.. దీనికి పరిష్కారం చూపేందుకు ఇరు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి.

కోటా అభివృద్ధి ఓకే.. కానీ,

రాజస్థాన్‌లో కోటా నగరానికి ప్రత్యేక స్థానముంది. వివిధ పోటీ పరీక్షలకు కోచింగ్‌ కోసం దేశ నలుమూలల నుంచి విద్యార్థులు ఇక్కడికి వస్తుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్‌ ప్రభుత్వం పెద్ద మొత్తంలో మౌలిక సదుపాయాలను కల్పించింది. అయితే, ఇది ఎంతవరకు ఆ పార్టీకి అనుకూలంగా మారుతుందన్న దానిపై స్పష్టత లేదు. అయితే, కోటాలో ఇటీవల చోటు చేసుకుంటున్న విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని భాజపా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. కోచింగ్ సెంటర్లు, విద్యా సంస్థలపై ప్రభుత్వ పర్యవేక్షణ లోపించిందని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.

ఆ ఐదు స్థానాల్లో భాజపా సందేహమే..

హాడౌతీలోని మొత్తం 17 నియోజకవర్గాల్లో 5 స్థానాల్లో భాజపా విజయం సాధించడం కత్తిమీద సామే. 1.హిందోలి.. ఇక్కడ గత 5 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 4 సార్లు విజయం సాధించింది. 2. కోటా ఉత్తర.. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ప్రాబల్యం అధికం. ముఖ్యమంత్రి గహ్లోత్‌కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న శాంతి ధరివాల్‌ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 3. అంటా.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ప్రమోద్‌ జైన్‌కు ఈ స్థానంపై మంచి పట్టు ఉంది. 4. కిషన్‌ గంజ్‌.. గత 5 ఎన్నికల్లో భాజపా ఈ స్థానం నుంచి కేవలం ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. ఈ నాలుగింటితోపాటు కాంగ్రెస్‌ నేత భరత్‌ సింగ్‌ బరిలో నిలుస్తున్న సంగోద్‌ నియోజకవర్గంపైనా భాజపా ఆశలు సన్నగిల్లుతున్నాయి. 2008, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఈ స్థానం నుంచి విజయం సాధించడంతో ఈసారి కూడా ఇక్కడ తమ గెలుపు అనుమానమేనని భాజపా వర్గాలు భావిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని