Secunderabad Cantonment: కంటోన్మెంట్‌ హస్తగతం

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీగణేశ్‌ విజయం సాధించారు. 13,206 ఓట్ల ఆధిక్యంతో తమ సమీప భాజపా అభ్యర్థి డాక్టర్‌ వంశతిలక్‌పై గెలుపొందారు.

Updated : 05 Jun 2024 07:35 IST

13,206 ఓట్ల మెజార్టీతో శ్రీగణేశ్‌ విజయం

కౌంటింగ్‌ పూర్తయిన అనంతరం తన నివాసానికి వచ్చిన శ్రీగణేశ్‌ను సన్మానిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీగణేశ్‌ విజయం సాధించారు. 13,206 ఓట్ల ఆధిక్యంతో తమ సమీప భాజపా అభ్యర్థి డాక్టర్‌ వంశతిలక్‌పై గెలుపొందారు. శ్రీగణేశ్‌కు 53,651 ఓట్లు రాగా.. వంశతిలక్‌కు 40,445 ఓట్లు వచ్చాయి. భారాస అభ్యర్థి నివేదిత 34,462 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఇక్కడ మొత్తం 1,31,294 ఓట్లు పోలయ్యాయి. నోటాకు 969 ఓట్లు వచ్చాయి. 2023 డిసెంబరులో వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఈ స్థానం నుంచి భారాస అభ్యర్థి లాస్య నందిత గెలుపొందారు. కానీ రెండు నెలల్లోనే రోడ్డు ప్రమాదంలో ఆమె చనిపోవడంతో కంటోన్మెంట్‌కు ఉపఎన్నిక అనివార్యమైంది. త్రిముఖ పోరులో కాంగ్రెస్‌ పార్టీ గెలుపొందింది. మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్‌ నుంచి శ్రీగణేశ్‌ ఆధిక్యం ప్రదర్శించారు. 8 రౌండ్ల వరకు కాంగ్రెస్, భారాస మధ్య పోటీ నెలకొనగా.. ఆ తర్వాత నుంచి కాంగ్రెస్, భాజపా మధ్య పోటీ కొనసాగింది. 17వ రౌండ్‌ వరకు అన్నింట్లోనూ శ్రీగణేశ్‌ ఆధిక్యం కనబర్చి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా తరఫున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన శ్రీగణేశ్‌.. ఉపఎన్నికకు ముందు కాంగ్రెస్‌లో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని