Arvind Kejriwal: Arvind Kejriwal: కేజ్రీవాల్ పిటిషన్‌ను ఏప్రిల్ 15న విచారించనున్న సుప్రీం

దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) సుప్రీంలో వేసిన పిటిషన్‌ను భారత సుప్రీంకోర్టు ఏప్రిల్ 15న విచారించనుంది. 

Updated : 13 Apr 2024 16:17 IST

దిల్లీ:  మనీలాండరింగ్‌ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సమర్థిస్తూ దిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పును సవాల్‌ చేస్తూ దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) సుప్రీంలో వేసిన పిటిషన్‌ను భారత సుప్రీంకోర్టు ఏప్రిల్ 15న విచారించనుంది. న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ జరపనుంది. 

ఎక్సైజ్ పాలసీ కేసులో మనీలాండరింగ్ విచారణకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ నెల రోజుల క్రితం అరెస్టు చేసింది.  తన అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ దిల్లీ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ ఆయనకు నిరాశే ఎదురైంది. సీఎం అరెస్టును సమర్థించేందుకు ఈడీ వద్ద తగినన్ని ఆధారాలు ఉన్నాయని దిల్లీ హైకోర్టు  తీర్పునిచ్చింది. అరెస్టు విషయంలో దర్యాప్తు సంస్థను నిందించలేమని పేర్కొంది. మనీలాండరింగ్‌పై ఈడీ ఆధారాలు చూపించిందని, 2022 గోవా ఎన్నికలకు రూ.45 కోట్లు ఇచ్చినట్లు అప్రూవర్‌ చెప్పారని పేర్కొంది.  తాజాగా కోర్టు ఆయనకు ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీనిపై కేజ్రీవాల్ సుప్రీంను ఆశ్రయించారు.

మద్యం దుకాణాల వ్యాపారులకు లైసెన్సులు మంజూరుచేయడానికి వారి నుంచి ఆప్ నాయకులు రూ.100 కోట్లు తీసుకున్నారని సీబీఐ, ఈడీ ఆరోపించాయి. ఈ విధానం ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లేలా, కొందరు మద్యం వ్యాపారులకు అనుకూలంగా ఉందని దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. కేజ్రీవాల్‌తోపాటు ఆప్‌ నేత మనీష్‌ సిసోడియా ఇదే కేసులో గతేడాది ఫిబ్రవరి నుంచి జైల్లో ఉన్నారు. ఈ కేసులో జైలు శిక్ష అనుభవించిన మరో ఆప్ నేత సంజయ్ సింగ్ ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని