Election Results: ‘ఎగ్జిట్‌ పోల్స్‌’ సంస్థలు ప్రజలకు క్షమాపణ చెప్పాలి: ఆప్‌ నేత సంజయ్‌సింగ్‌

Election Results: ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తప్పిన నేపథ్యంలో సర్వేలు నిర్వహించిన సంస్థలన్నీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌ డిమాండ్‌ చేశారు.

Published : 04 Jun 2024 16:08 IST

Election Results | దిల్లీ: ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించిన సంస్థలన్నీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌ డిమాండ్‌ చేశారు. ఎగ్జిట్‌ పోల్స్‌ (Exit Polls) అంచనాల వల్ల స్టాక్‌ మార్కెట్‌లో భారీ మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. అలాగే ప్రజలు, ఎన్నికల సంఘం, ప్రభుత్వ యంత్రాంగాలను మోసం చేశాయని ఆరోపించారు. 

వాస్తవ ఫలితాలతో పోలిస్తే ఎగ్జిట్‌ పోల్స్‌ (Exit Polls) అంచనాలు చాలా భిన్నంగా ఉంటాయని తాను ముందునుంచీ చెబుతున్నానని సంజయ్‌ సింగ్‌ అన్నారు. పూర్తి ఫలితాలు వెలువడే సమయానికి ఇండియా కూటమికే సానుకూల వాతావరణం ఉంటుందని అంచనా వేశారు.

కేంద్రంలో భాజపా మరోసారి పాలనా పగ్గాలు చేపట్టడం ఖాయమని ఎగ్జిట్‌ పోల్స్‌ (Exit Polls) ముక్తకంఠంతో తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. కమలదళం నేతృత్వంలోని ఎన్డీయే 350 స్థానాలకుపైగా దక్కించుకోవడం ఖాయమని మెజార్టీ సంస్థలు జోస్యం చెప్పాయి. కాంగ్రెస్‌ నాయకత్వంలోని ‘ఇండియా’ కూటమి 150 సీట్లకు కాస్త అటూఇటూగా పరిమితమవుతుందని అభిప్రాయపడ్డాయి. ఇప్పటివరకు ఉన్న ట్రెండ్స్‌ ప్రకారం ఎన్డీయే కూటమి మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. సీట్ల సంఖ్యాపరంగా మాత్రం అంచనాల కంటే వెనకబడింది. మరోవైపు ఇండియా కూటమి అనూహ్యంగా పుంజుకుంటోంది.

ఈ అంచనాల నేపథ్యంలో సోమవారం స్టాక్‌ మార్కెట్లు (Stock Market) భారీగా లాభపడ్డాయి. మదుపర్ల సంపద దాదాపు రూ.16 లక్షల కోట్ల మేర పెరిగింది. కానీ, ఈరోజు ఫలితాల నేపథ్యంలో మదుపర్లు భారీ ఎత్తున అమ్మకాలకు దిగారు. దీంతో స్టాక్ మార్కెట్లు కకావికలం అయ్యాయి. మదుపర్ల సంపద దాదాపు రూ.35 లక్షల కోట్ల వరకు ఆవిరైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు