Telangana: ముఖ్యమంత్రి.. మంత్రివర్గంపై కొలిక్కిరాని చర్చలు

 తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతున్న తరుణంలో సీఎల్పీ నాయకుడు ఎవరు? అనేదానిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు.

Updated : 04 Dec 2023 19:45 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతున్న తరుణంలో సీఎల్పీ నాయకుడు ఎవరు? అనేదానిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. ఓ వైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ.. కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. గచ్చిబౌలిలోని ఎల్లా హొటల్‌లో సమావేశమైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా సీఎల్పీ ఎంపిక నిర్ణయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగిస్తూ ఏక వాక్య తీర్మానం చేశారు. దీనిని భట్టి విక్రమార్క, సీతక్కతోపాటు పలువురు ఎమ్మెల్యేలు బలపరిచారు. రాష్ట్ర నాయకత్వం పంపిన తీర్మానాన్ని అధ్యయనం చేసి అధిష్ఠానం ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఎవరా? అన్న దానిపై స్పష్టత రాకపోవడంతో ఇవాళ ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండకపోవచ్చని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

👉 Follow EENADU WhatsApp Channel

సీఎల్పీ నేత ఎంపికపై అధిష్ఠానంతో చర్చించేందుకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ దిల్లీకి బయలుదేరి వెళ్లారు. అధిష్ఠానం నుంచి ప్రకటన వచ్చాకే గవర్నర్‌ను కాంగ్రెస్‌ నేతలు కలవనున్నట్టు తెలుస్తోంది. అప్పుడే సీఎం ప్రమాణ స్వీకారంపై స్పష్టత రానుంది. అధిష్ఠానం నిర్ణయం కోసం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వేచిచూస్తున్నారు. మరోవైపు, ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం కోసం రాజ్ భవన్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళే ప్రమాణ స్వీకారం ఉండవచ్చన్న సమాచారం నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం కోసం అవసరమైన కుర్చీలు, టెంట్లు, సహా ఇతరత్రా సామగ్రిని ఇప్పటికే తరలించారు. సాధారణ పరిపాలనా శాఖ, ఆర్‌అండ్‌బీ, జీహెచ్ఎంసీ సహా ఇతర శాఖల అధికారులు అవసరమైన కసరత్తు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని