TDP - JanaSena Alliance: పవన్‌ ప్రకటనను స్వాగతించిన తెదేపా, జనసేన శ్రేణులు

తెలుగుదేశం - జనసేన పొత్తును సైకిల్ శ్రేణులు స్వాగతించాయి. రాక్షస సంహారం కోసం శక్తులు ఒక్కటి అయ్యాయని తెదేపా నేతలు తెలిపారు. పొత్తులో భాగంగా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని స్పష్టం చేశారు.

Published : 14 Sep 2023 18:17 IST

అమరావతి: తెలుగుదేశం - జనసేన పొత్తును సైకిల్ శ్రేణులు స్వాగతించాయి. రాక్షస సంహారం కోసం శక్తులు ఒక్కటి అయ్యాయని తెదేపా నేతలు తెలిపారు. పొత్తులో భాగంగా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఓ కమిటీ ఏర్పాటు చేసుకుని అందుకు తగ్గట్టుగా ఐక్య కార్యాచరణ ప్రకటించుకుంటామని వెల్లడించారు. తెదేపా - జనసేన పొత్తు రాజకీయ సమీకరణలకు కేంద్రమైన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఇక వార్ వన్ సైడ్ అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు జనసేనతో పొత్తును ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వంగలపూడి అనిత, చినరాజప్ప, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆదిరెడ్డి వాసు తదితరులు స్వాగతించారు.

వైకాపాకు 175 స్థానాల్లో డిపాజిట్లు రావు

తెదేపా, జనసేన కలయికను తామంతా స్వాగతిస్తున్నామని ఆ పార్టీ నేత పయ్యావుల కేశవ్‍ చెప్పారు. రేణిగుంట విమానాశ్రయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. పవన్ కల్యాణ్‌ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. త్వరలోనే కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. తెదేపా, జనసేన కలిసి పోటీ చేయాలని ఐదు కోట్ల ప్రజలు కోరుకుంటున్నదే అని ఏలూరులో మాజీ మంత్రి ప్రత్తిపాటి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాకు 175 స్థానాల్లో డిపాజిట్లు కూడా రావన్నారు.

శుభ పరిణామం

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా, జనసేన కలిసి పోటీ చేస్తుందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌  ప్రకటించడం శుభ పరిణామమని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. తెదేపా, జనసేన కలిసి పోటీ చేయాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారన్నారు. తెదేపాతో కలిసి పనిచేయాలని ప్రకటించటం హర్షణీయమని తెదేపా మాజీ మంత్రి పరిటాల సునీత చెప్పారు. జగన్‌ను ఇంటికి పంపటానికి చేతులు కలపటాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

సరైన సమయంలో సరైన నిర్ణయం

మరోవైపు, తమ అధినేత సరైన సమయంలో సరైన నిర్ణయం ప్రకటించారని, దీనిని స్వాగతిస్తున్నామని విశాఖలోని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ తెలిపారు. జనసేన- తెదేపా కలిస్తే విశాఖ కార్పొరేషన్ లాంటి చోట ప్రజా సమస్యలపై గట్టిగా నిలదీయగలుగుతామన్నారు. వైకాపా చేస్తున్న అక్రమాలకు మరో ఆర్నెల్లలో చరమ గీతం పాడతామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు