YSRCP: ఇంకా పేట్రేగిపోతున్న వైకాపా మూకలు

దాడులు, దాష్టీకాలు, దౌర్జన్యాలతో ఐదేళ్లుగా పేట్రేగిపోయిన వైకాపా మూకలు.. అధికారం కోల్పోయాక కూడా అదే దమనకాండ కొనసాగిస్తున్నాయి.

Published : 11 Jun 2024 06:00 IST

 అధికారం కోల్పోయినా అదే హింసాకాండ 
6 రోజుల్లో ఇద్దరు తెదేపా కార్యకర్తల హత్య 
తిరిగి, ‘దొంగే.. దొంగా దొంగా’ అన్నట్లుగా పెడబొబ్బలు

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని బొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం హత్యకు గురైన తెదేపా కార్యకర్త గిరినాథ్‌చౌదరి

ఈనాడు, అమరావతి: దాడులు, దాష్టీకాలు, దౌర్జన్యాలతో ఐదేళ్లుగా పేట్రేగిపోయిన వైకాపా మూకలు.. అధికారం కోల్పోయాక కూడా అదే దమనకాండ కొనసాగిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక రాష్ట్రంలో గత ఆరు రోజుల్లో ఇద్దరు తెదేపా కార్యకర్తలను వైకాపా అరాచక శక్తులు బలిగొన్నాయి. అనేక చోట్ల భౌతిక దాడులకు తెగబడుతున్నాయి. ఫలితాలు వెల్లడైన రోజే మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన తెదేపా కార్యకర్త షేక్‌ ఖాశీం (24)ను వైకాపా కార్యకర్తలు కర్రలు, క్రికెట్‌ బ్యాట్లతో కొట్టి పాశవికంగా చంపేశారు. తమ పార్టీ గెలిచిన సంతోషంలో ఖాశీం ద్విచక్ర వాహనానికి తెదేపా జెండా కట్టుకుని స్నేహితుడితో కలిసి తిరుగుతుండగా, ఓటమిని జీర్ణించుకోలేని వైకాపా మూకలు ఈ దారుణానికి ఒడిగట్టాయి. తాజాగా కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మరెడ్డిపల్లిలో తెదేపా కార్యకర్త గిరినాథ్‌ చౌదరి(35)ని వేట కొడవళ్లతో వెంటాడి నరికేశారు. ఆయన సోదరుడు కల్యాణ్‌పైనా హత్యాయత్నం జరగ్గా, తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై వైకాపా మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, ఆమె అనుచరుల పాత్ర ఉందని బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. ఇంతటి అరాచకాలకు పాల్పడుతున్న వైకాపా మూకలు, ‘దొంగే.. దొంగా దొంగా’ అన్న రీతిన పెడబెబ్బలు పెడుతున్నాయి. ఓ వైపు తెదేపా శ్రేణులపై దౌర్జన్యాలకు పాల్పడుతూనే, మరోవైపు తెదేపా కార్యకర్తలే తమపై దాడులు చేస్తున్నారంటూ గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం వైకాపాకే చెల్లింది. 

ఆటవిక పరిస్థితులు కల్పిస్తున్నదెవరు?

రాష్ట్రంలో తెదేపా శ్రేణులే లక్ష్యంగా వైకాపా నాయకులు పెద్ద ఎత్తున హింసాకాండను ప్రోత్సహిస్తుంటే.. ఆ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ఏమీ తెలియనట్లుగా ‘రాష్ట్రంలో తెదేపా దాడులతో ఆటవిక పరిస్థితులు నెలకొన్నాయి. వైకాపా నాయకులు, కార్యకర్తలపై ఉన్మాదంతో దాడులు చేస్తున్నారు?’ అంటూ ఇటీవల ట్వీట్‌ చేశారు. ఆ పార్టీ నాయకులు గవర్నర్‌ను కలిసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ ఫిర్యాదు చేశారు. ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలను కిరాతకంగా చంపడమే వైకాపా దృష్టిలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఓటమి కసితో దాడులు చేస్తున్నదీ, హింసను ప్రేరేపిస్తున్నదీ, ఉన్మాదంతో రెచ్చిపోతూ ప్రాణాలు తీస్తున్నదీ వైకాపా వారే. ఈ అకృత్యాలను కప్పి పుచ్చుకునేందుకు నెపాన్ని ఇతరులపై నెడుతున్నారు. వైకాపా హయాంలో నియమితులై ఆ పార్టీకి అంటకాగిన డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది ఇప్పటికీ అదే పంథాలో వెళ్తున్నారు. కొందరైతే పరోక్షంగా సహకరిస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. ఈ పక్షపాత వైఖరిపై ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించకపోతే శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లే ముప్పు ఉంది.

కవ్వింపు చర్యల ఫలితమే ఘర్షణలు

ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేని వైకాపా శ్రేణులు పలుచోట్ల తెదేపా వారిని కవ్విస్తున్నాయి. ప్రతిగా, తెదేపా శ్రేణులు కూడా గతంలో తమపై జరిగిన దాడులను గుర్తుచేసుకుని వైకాపా దుందుడుకు చర్యల పట్ల స్పందిస్తున్నాయి. ఈ క్రమంలో అక్కడక్కడా ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల వైకాపా కార్యకర్తలూ బాధితులవుతున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు మాత్రం ‘వైకాపా శ్రేణులు కవ్వించినా, రెచ్చగొట్టినా, సంయమనం పాటించండి. వాటికి స్పందించొద్దు’ అని తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని