Andhra Pradesh News: తెదేపా నేతల గృహ నిర్బంధం

ఎన్నికల సందర్భంగా వైకాపా దాడుల్లో గాయపడిన తెదేపా కార్యకర్తలను పరామర్శించడానికి ఆ పార్టీ గురువారం చలో మాచర్ల కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి విదితమే.

Published : 24 May 2024 04:16 IST

‘చలో మాచర్ల’కు వెళ్లనీయకుండా పోలీసుల ముందస్తు చర్యలు

గుంటూరులోని నివాసంలో మాచర్ల తెదేపా అభ్యర్థి బ్రహ్మారెడ్డికి నోటీసులు ఇస్తున్న సీఐ

ఈనాడు, అమరావతి-న్యూస్‌టుడే, గొల్లపూడి: ఎన్నికల సందర్భంగా వైకాపా దాడుల్లో గాయపడిన తెదేపా కార్యకర్తలను పరామర్శించడానికి ఆ పార్టీ గురువారం చలో మాచర్ల కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి విదితమే. రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలతో కమిటీ వేసి బాధితులను పరామర్శిస్తామని పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో గుంటూరు, పల్నాడు జిల్లాల్లో తెదేపా నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేసి మాచర్ల వెళ్లకుండా అడ్డుకున్నారు. గుంటూరు నగరంలో తెదేపా నేతలు నక్కా ఆనంద్‌బాబు, జూలకంటి బ్రహ్మారెడ్డి, కనపర్తి శ్రీనివాసరావు, చిలకలూరిపేటలో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, నరసరావుపేటలో చదలవాడ అరవిందబాబును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. చలో మాచర్లకు వెళ్లవద్దని తెదేపా ద్వితీయ శ్రేణి నేతలకు ముందస్తుగా నోటీసులిచ్చారు. 

పిన్నెల్లి పరారీ వెనుక సజ్జల సహకారం

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీ వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి వంటి పెద్దల సహకారం ఉందని మాచర్ల తెదేపా అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు. గుంటూరులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి చట్టం, ప్రజాస్వామ్యంపై గౌరవం లేదన్నారు. అందుకే గోడ దూకి పారిపోయారన్నారు. గంటలో మాచర్ల వస్తానని సవాల్‌ విసిరిన పిన్నెల్లి ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. పిన్నెల్లి పారిపోవడానికి పోలీసులు అన్నివిధాలా సహకరించారని, మాచర్లలో దాడులకు పాల్పడినవారి విషయంలో ఉదాసీనంగా ఉన్నారని మండిపడ్డారు. ‘పాల్వాయి గేటు, కేపీగూడెం, మాచర్లలో వైకాపా వారు దాడులు చేస్తే పోలీసులు నామమాత్రపు సెక్షన్లతో కేసులు పెట్టారు. కేపీగూడెంలో తెదేపా తరఫున ఏజెంట్లుగా కూర్చున్న గిరిజనుల్ని దారుణంగా కొట్టారు. దాడుల్లో గాయపడిన వారిని పరామర్శించేందుకు వెళ్తామంటే పోలీసులు అడ్డుకున్నారు. త్వరలోనే మాచర్ల వెళ్లి బాధితులను కలిసి వారికి న్యాయం చేస్తాం’ అని బ్రహ్మారెడ్డి స్పష్టంచేశారు.

బ్రహ్మారెడ్డి ఇంటి వద్ద పోలీసు బందోబస్తు

అరెస్టు చేయకపోవడం దారుణం

పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు ఎందుకు అరెస్టు చేయడం లేదని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. ‘చలో మాచర్ల’కు వెళ్లకుండా ఉమామహేశ్వరరావును ఎన్టీఆర్‌ జిల్లా గొల్లపూడిలోని ఆయన నివాసం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ... సీఎస్‌ జవహర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఐపీఎస్‌ అధికారి ఆంజనేయులు పర్యవేక్షణలో కొంతమంది పోలీసులు... పిన్నెల్లికి సహకారం అందిస్తున్నారని ఆరోపించారు. పిన్నెల్లిపై పత్రికల్లో వచ్చిన కథనాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. 

మాచర్ల సహా పల్నాడు జిల్లాలో పోలింగ్‌ రోజు, అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలకు పోలీసుల ఉదాసీన వైఖరే కారణమని దేవినేని ఉమా ధ్వజమెత్తారు. బాధితులైన తెదేపా కార్యకర్తల్ని రక్షించడంలో వారు విఫలమయ్యారని ఆరోపించారు. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి చేసిన దౌర్జన్యాల్ని వివరిస్తూ డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తాకు గురువారం ఆయన లేఖ రాశారు. పల్నాడు జిల్లాలో చోటు చేసుకొన్న హింసాత్మక ఘటనల్ని, పోలీసుల వైఫల్యాల్ని అందులో సమగ్రంగా వివరించారు.

ఎన్టీఆర్‌ జిల్లా గొల్లపూడిలోని నివాసం వద్ద దేవినేని ఉమాను అడ్డుకున్న పోలీసులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని