Andhra News: సామాన్య ప్రజలకు ఆంక్షలు.. జూదం ఆడేవాళ్లకు ప్రత్యేక పడవలా?: జగన్‌కు అనగాని లేఖ

వైకాపా నేతల ఆధ్వర్యంలో కృష్ణా నదీ తీరంలోని దిబ్బలు, ద్వీపాల్లో యథేచ్చగా జూద కేంద్రాలు నడుస్తున్నాయని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. ఈ మేరకు అనగాని సత్యప్రసాద్ సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు.

Published : 03 Dec 2022 10:55 IST

అమరావతి: వైకాపా నేతల ఆధ్వర్యంలో కృష్ణా నదీ తీరంలోని దిబ్బలు, ద్వీపాల్లో యథేచ్చగా జూద కేంద్రాలు నడుస్తున్నాయని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. జూద కేంద్రాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్‌ అసెంబ్లీలో చెప్పిన హామీ నేటికీ నెరవేరలేదని విమర్శించారు. ఈ మేరకు అనగాని సత్యప్రసాద్ సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు.

‘‘రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నంలో ఓ వైకాపా నేత కుటుంబసభ్యులు జూద కేంద్రాలను నిర్వహిస్తున్నారు. సామాన్య ప్రజలు నదీతీర ప్రాంతానికి వెళ్లాలంటే అనేక ఆంక్షలు విధిస్తున్నారు. కానీ జూదం ఆడేవాళ్లకు మాత్రం ప్రత్యేక పడవలు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఆర్గనైజ్‌డ్‌ గ్యాంబ్లింగ్‌పై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మూడు ముక్కలాటతో ప్రజలు జోకర్లుగా మిగిలిపోతున్నారు. రెండు రోజుల క్రితం రేపల్లె మండలం పేటేరు గ్రామంలో జూదంలో సర్వస్వం కోల్పోయి గుండెపోటుతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

రేపల్లె కేంద్రంగా కొత్తగా డీఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేసి.. సీఐ, నలుగురు ఎస్సైలు ఉన్నా జూద కేంద్రాలను నిలువరించలేకపోతున్నారు. చాటుమాటున ఆడే వారిపై దాడులు చేసి కేసులు పెట్టే ప్రభుత్వం.. రేపల్లె నదీ ప్రాంతంలో జరుగుతున్న ఈ వ్యవహారంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? వెంటనే ఆ క్లబ్బులను మూసివేయించి నదీతీర ప్రాంతంలో గస్తీ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. వాటిని నిర్వహిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’’ అని అనగాని సత్యప్రసాద్‌ డిమాండ్ చేశారు. అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించిన కొన్ని ఫొటోలను సీఎంకు రాసిన లేఖకు జత చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని