Pinnelli: పిన్నెల్లి సోదరుల మాఫియా

మాచర్ల నియోజకవర్గాన్ని ప్రైవేటు ఎస్టేటుగా మార్చుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు అక్కడ సహజ వనరులను కొల్లగొట్టారని, ప్రశ్నించిన వారిపై పైశాచికంగా దాడులకు పాల్పడి మారణహోమం సృష్టించారని తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది.

Updated : 29 May 2024 09:47 IST

8 హత్యలు.. 79 దాడులు.. వేల ఎకరాల భూకబ్జా
మొత్తం దోపిడీ రూ.2 వేల కోట్లు 
‘పిన్నెల్లి పైశాచికం’ పుస్తకంలో తెదేపా
సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చ

ఈనాడు, అమరావతి: మాచర్ల నియోజకవర్గాన్ని ప్రైవేటు ఎస్టేటుగా మార్చుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు అక్కడ సహజ వనరులను కొల్లగొట్టారని, ప్రశ్నించిన వారిపై పైశాచికంగా దాడులకు పాల్పడి మారణహోమం సృష్టించారని తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది. ‘ప్రజలంతా తమ బానిసలనే విధంగా మాచర్లలో ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటుచేసుకుని వేధించారు. పిన్నెల్లి దోపిడీ రూ.2 వేల కోట్లు. ఆయన మాఫియా చేసిన హత్యలు 8, అన్ని వర్గాలపై దాడులు 79’ అని వివరించింది. ‘పిన్నెల్లి పైశాచికం’ పేరుతో తెదేపా 28 పేజీలతో రూపొందించిన పుస్తకం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ‘2011-12 సంవత్సరంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదాయం రూ.1.95 లక్షలుంటే.. ఇప్పుడు అధికారికంగా రూ.43 లక్షలు చూపిస్తున్నా అనధికారికంగా ఏటా రూ.250 కోట్లకుపైనే ఉంటుంది. అప్పులతో ఊరొదిలి పారిపోయిన పరిస్థితి నుంచి వేల కోట్లకు పడగలెత్తారు’ అని పేర్కొంది. అధికారికంగా ప్రకటించిన ఆస్తుల వివరాలను అందులో వివరించారు. రెంటాలలో తెదేపా ఏజెంటుగా ఉన్న చేరెడ్డి మంజులపై దాడి చేసి తలకు తీవ్ర గాయం చేయడం, కారంపూడిలో తెదేపా కార్యాలయ ధ్వంసం, పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం తదితర చిత్రాలు పుస్తకంలో ఉన్నాయి. 

పిన్నెల్లిపై తెదేపా పుస్తకం కోసం క్లిక్‌ చేయండి

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై 51 దాడులు

ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడటంతోపాటు తెదేపా జెండా పట్టుకుని తిరిగారంటూ గుండ్లపాడులో తెదేపా నాయకుడు చంద్రయ్యను దారుణంగా హతమార్చారని తెదేపా దుయ్యబట్టింది. ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులను కలిసేందుకు వెళ్లిన బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నలపై మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి అనుచరుడు తురకా కిశోర్‌ హత్యాయత్నం చేశారు. 30 కి.మీ.మేర వెంటాడి రాళ్లు, రాడ్లు, కర్రలతో దాడికి తెగబడ్డారు. తాగునీరు అడిగిన నేరానికి రెంటచింతల మండలం మల్లవరం తండాలో బాణావత్‌ సామునిబాయ్‌ను హతమార్చారు’ అని పేర్కొంది. ఎన్నికల సందర్భంగా మొత్తం 79 దాడులు చేయగా అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై దాడులే 51 ఉన్నాయని వివరించింది. మాచర్ల పట్టణం, కంభంపాడు, ఒప్పిచర్ల, కేపీగూడెం, కొత్తూరు, రెంటాల, కాకానివారిపాలెం, తుమృకోట, కండ్లకుంట, పోలేపల్లి, పాల్వాయిగేటు, రాయవరం, పట్లవీడు తదితర ప్రాంతాల్లో బాధితుల పేర్లతో కూడిన జాబితాను ప్రస్తావించారు. ఆత్మకూరులో దళితుల బహిష్కరణ, పోలింగ్‌ కేంద్రాన్ని వదిలి వెళ్లాలంటూ ఏజెంటుకు వీడియోకాల్‌ తదితర సంఘటనలపై పత్రికల్లో వచ్చిన క్లిప్పింగులను జత చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని