Graduate MLC by election: ఎమ్మెల్సీ విజేత తేలేది రెండో ప్రాధాన్య ఓట్లతోనే

వరంగల్‌-ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. తొలి ప్రాధాన్య ఓట్లలో అధికార కాంగ్రెస్‌ మద్దతిచ్చిన అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు, ప్రతిపక్ష భారాసకు చెందిన ఏనుగుల రాకేశ్‌రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు.

Updated : 07 Jun 2024 06:46 IST

వాటి లెక్కింపు ప్రారంభించిన అధికారులు
‘మొదటి ప్రాధాన్యం’లో మల్లన్నకు 18,565 ఓట్ల మెజార్టీ 
తర్వాత స్థానంలో రాకేశ్‌రెడ్డి

ఎమ్మెల్సీ ఎన్నిక బ్యాలెట్‌ పత్రాలను లెక్కిస్తున్న సిబ్బంది

ఈనాడు, నల్గొండ: వరంగల్‌-ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. తొలి ప్రాధాన్య ఓట్లలో అధికార కాంగ్రెస్‌ మద్దతిచ్చిన అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు, ప్రతిపక్ష భారాసకు చెందిన ఏనుగుల రాకేశ్‌రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ముగిసేసరికి తీన్మార్‌ మల్లన్న తన సమీప ప్రత్యర్థి.. ఏనుగుల రాకేశ్‌రెడ్డిపై 18,565 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నల్గొండలోని దుప్పలపల్లి గిడ్డంగుల సంస్థ గోదాముల్లో ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్య ఓట్లు లెక్కించిన నాలుగు రౌండ్లలో కలిపి తీన్మార్‌ మల్లన్నకు 1,22,813 ఓట్లు రాగా.. రాకేశ్‌రెడ్డికి 1,04,248 ఓట్లు వచ్చాయి.

భాజపా మద్దతిచ్చిన అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి 43,313 ఓట్లతో మూడో స్థానంలో, మరో అభ్యర్థి పాలకూరి అశోక్‌గౌడ్‌ 29,697 ఓట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు గురువారం రాత్రికి పూర్తి కాగా.. గెలుపు కోటా (చెల్లిన ఓట్లలో 50 శాతానికంటే ఒక ఓటు ఎక్కువ)గా పరిగణించే 1,55,095 ఓట్లు ఎవరికీ రాకపోవడంతో విజేతను నిర్ణయించడానికి అధికారులు రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. గెలుపు కోసం తీన్మార్‌ మల్లన్నకు 32,282 ఓట్లు, రాకేశ్‌రెడ్డికి 50,847 ఓట్లు రావాలి. ఎలిమినేషన్‌ క్రతువు శుక్రవారం మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశాలున్నాయి. 

ఏమిటీ ఎలిమినేషన్‌ ప్రక్రియ?

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యతలో గెలుపు కోటాకు సరిపడే ఓట్లు ఏ అభ్యర్థికీ రాకపోవడంతో ఎలిమినేషన్‌ ప్రక్రియలో రెండో ప్రాధాన్య ఓటును లెక్కించడం ద్వారా విజేతను నిర్ణయించనున్నారు. పోటీ చేసిన మొత్తం అభ్యర్థుల్లో మొదటి ప్రాధాన్య ఓట్లు అతి తక్కువగా వచ్చిన వారిని తొలుత గుర్తించి.. వారి బ్యాలెట్‌ పత్రాల్లో రెండో ప్రాధాన్య ఓటు ఎవరికి వచ్చిందో వాటిని ఆ అభ్యర్థికి జమ చేస్తారు. అనంతరం తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని లెక్కింపు ప్రక్రియ నుంచి క్రమపద్ధతిలో తప్పిస్తారు. దీన్నే ఎలిమినేషన్‌ అంటారు. రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) దాసరి హరిచందన సూచన మేరకు అభ్యర్థులు సాధించిన ఓట్ల ఆధారంగా ఆరోహణ క్రమంలో జాబితాను తయారు చేశారు. అందులోని వారందరికీ సమాచారం ఇచ్చి వారి సమక్షంలోనే ఎలిమినేషన్‌ ప్రక్రియను ప్రారంభించారు. 

ఇలా చేపట్టారు..

తొలుత అతి తక్కువగా 10 ఓట్లు వచ్చిన స్వతంత్ర అభ్యర్థి యాతాకుల శేఖర్‌ని తొలగించి ఆయన బ్యాలెట్‌లో రెండో ప్రాధాన్య ఓట్లు వచ్చిన అభ్యర్థులకు ఆ ఓట్లను జమ చేశారు. ఆ తర్వాత 11 ఓట్లు వచ్చిన కొనకాల మోహన్‌రెడ్డి, 12 ఓట్లు వచ్చిన బూర ముత్తలింగంలను లెక్కింపు ప్రక్రియ నుంచి తొలగించి వారి బ్యాలెట్‌ పత్రాల్లో రెండో ప్రాధాన్య ఓట్లను సంబంధిత అభ్యర్థులకు బదిలీ చేశారు. ఎవరో ఒకరికి గెలుపు కోటా ఓట్లు వచ్చే వరకు ఈ ప్రక్రియ సాగుతుంది. మొత్తం 52 మంది అభ్యర్థుల్లో తొలి ప్రాధాన్య ఓట్లలో 100 లోపు ఓట్లు వచ్చిన వారు 26 మంది, వెయ్యి లోపు ఓట్లు వచ్చిన వారు 20 మంది ఉన్నారు. 

భారీగా చెల్లని ఓట్లు 

ఈ ఎన్నికల్లో 3,36,013 ఓట్లు పోలవగా.. ఇందులో 25,824 చెల్లని ఓట్లుగా అధికారులు నిర్ధారించారు. వీటిలో తొలి మూడు స్థానాల్లో ఉన్న వారివే ఎక్కువగా ఉండటం గమనార్హం. మొదటి రెండు రౌండ్లలోనే 15,126 ఓట్లు చెల్లకుండా పోయాయి. నిబంధనల ప్రకారం ఓటర్లు బ్యాలెట్‌ పత్రాల్లో నచ్చిన అభ్యర్థి పక్కన ఉన్న గడిలో నంబర్లు వేయాల్సి ఉంది. కానీ చాలా మంది ఓటర్లు ఆ గడిలో రైట్‌ మార్కు చేయడం, అభ్యర్థి ఫొటోపై సంతకం, ప్రాధాన్యతను తెలిపే సంకేతాన్ని తెలుగులో, ఆంగ్లంలో రాయడం, కొన్ని చోట్ల ‘జై తెలంగాణ’ ‘జై కాంగ్రెస్‌’ వంటి నినాదాలు రాయడం వంటి చర్యలకు పాల్పడడంతో ఎక్కువ ఓట్లు చెల్లకుండా పోయాయి. 

ఆరోపణలు.. ప్రత్యారోపణలు

మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు మూడో రౌండ్‌లో తమకు వెయ్యి ఓట్లు ఎక్కువగా వచ్చినా కౌంటింగ్‌ ఏజెంట్ల సంతకం లేకుండానే ఆర్వో దాసరి హరిచందన ఏకపక్షంగా మీడియాకు వెల్లడించారని భారాస అభ్యర్థి రాకేశ్‌రెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణలను హరిచందన ఖండించారు. అనుమానాలుంటే నివృత్తి చేయడానికి సిబ్బంది, అధికారులున్నారని.. అసత్య ఆరోపణలు సరికాదన్నారు. లెక్కింపు విధుల్లో తమకు నల్గొండ మాజీ ఎమ్మెల్యే ఆటంకం కలిగిస్తున్నారంటూ.. ఎన్నికల అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి వెంకటేశ్వర్లు తిప్పర్తి ఎస్సైకి ఫిర్యాదు చేశారు. 

లెక్కింపులో అవకతవకలపై భారాస ఫిర్యాదు

హిమాయత్‌నగర్, న్యూస్‌టుడే: పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో అవకతవకలపై ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, భారాస లీగల్‌ సెల్‌ సభ్యురాలు లలితారెడ్డి గురువారం సాయంత్రం బీఆర్కే భవన్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఉప ఎన్నిక లెక్కింపులో భారాస మద్దతిచ్చిన రాకేశ్‌రెడ్డికి తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. రాకేశ్‌రెడ్డి మూడో రౌండ్‌లో 533, నాలుగో రౌండ్‌లో 170 పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉంటే.. జాబితాలో తీన్మార్‌ మల్లన్నకు చూపిస్తున్నారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని