Graduate MLC: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తీన్మార్‌ మల్లన్న ముందంజ

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బుధవారం అర్ధరాత్రి 12.30 గంటలు దాటాక మొదటి రౌండ్‌ లెక్కింపు వివరాలు వెల్లడయ్యాయి.

Published : 06 Jun 2024 03:59 IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థికి మొదటి రౌండ్‌లో 36,210 ఓట్లు
భారాస బలపరిచిన రాకేశ్‌రెడ్డికి 28,540
అర్ధరాత్రి 12.30 గంటలు దాటాక వెల్లడైన మొదటి రౌండ్‌ వివరాలు

భారాస అభ్యర్థి రాకేశ్‌రెడ్డితో కరచాలనం చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న

ఈనాడు, నల్గొండ: వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బుధవారం అర్ధరాత్రి 12.30 గంటలు దాటాక మొదటి రౌండ్‌ లెక్కింపు వివరాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన తీన్మార్‌ మల్లన్నకి 36,210, భారాస బలపరిచిన రాకేశ్‌రెడ్డికి 28,540, భాజపా బలపరచిన ప్రేమేందర్‌రెడ్డికి 11,395 ఓట్లు వచ్చాయి. మల్లన్న 7,670 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం తొలి రౌండ్‌లో 96,097 ఓట్లు ఉండగా అందులో చెల్లినవి 88,369 కాగా చెల్లనివి 7,728 ఓట్లు. రెండో రౌండ్‌ లెక్కింపు ప్రారంభమైంది. నల్గొండలోని దుప్పలపల్లి గిడ్డంగుల సంస్థ గోదాముల్లో బుధవారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అయింది. మొత్తం 605 పోలింగ్‌ కేంద్రాల్లో పోలైన 3.36 లక్షల బ్యాలెట్‌ పత్రాలను 25 చొప్పున తొలుత కట్టలు కట్టారు. అది మధ్యాహ్నం 3.30 గంటల వరకు కొనసాగింది.

ఒక్కో హాల్లో 24 టేబుళ్ల చొప్పున మొత్తం నాలుగు గదుల్లో 96 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌పై వేయి చొప్పున ఒక రౌండ్‌లో మొత్తం 96 వేల ఓట్లను మొదటి ప్రాధాన్య క్రమంలో లెక్కిస్తున్నారు. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు నాలుగు రౌండ్లలో పూర్తి కానుంది. గురువారం తెల్లవారుజాము వరకు మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పోలైన ఓట్లలో చెల్లని ఓట్లను తీసేసి అభ్యర్థుల గెలుపు కోటాను నిర్ణయిస్తారు. చెల్లిన ఓట్లలో 50 శాతానికి పైన ఒక ఓటు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ఫలితం... తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో తేలకపోవచ్చన్నది ప్రధాన పార్టీల అభిప్రాయం. అదే జరిగితే రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించి గెలుపు కోటాను చేరిన వారిని ఎమ్మెల్సీగా ప్రకటిస్తారు. 

ఏజెంట్లకు అభ్యర్థుల సూచనలు

సుదీర్ఘంగా సాగే ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు తీన్మార్‌ మల్లన్న(కాంగ్రెస్‌), ఏనుగుల రాకేశ్‌రెడ్డి(భారాస), గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి(భాజపా) సూచించారు. ఓట్ల లెక్కింపు సజావుగా సాగుతోందని ఆర్వో దాసరి హరిచందన ‘ఈనాడు’కు వెల్లడించారు. గురువారం మధ్యాహ్నానికి పూర్తి ఫలితం వెలువడే అవకాశం ఉందన్నారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద మూడంచెల భద్రతతో బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ చందనాదీప్తి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు