TS Assembly: డిజైన్.. నాణ్యత లోపం.. అవినీతి వల్లే దెబ్బతిన్న మేడిగడ్డ: మంత్రి ఉత్తమ్

తెలంగాణ నీటిపారుదల రంగంపై శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టింది. దీనిపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

Updated : 17 Feb 2024 12:02 IST

హైదరాబాద్‌: తెలంగాణ నీటిపారుదల రంగంపై శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రజంటేషన్‌ ఇచ్చారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ ఎంతో ముఖ్యమైనది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ద్వారా గత ప్రభుత్వం 19 లక్షల ఎకరాలకు నీరిచ్చే ఆలోచన చేసింది. దురదృష్టవశాత్తూ మేడిగడ్డ కుంగిపోయింది. డిజైన్‌, నిర్మాణ లోపాలు, ఓఅండ్‌ఎం పర్యవేక్షణ లోపం కారణంగా బ్యారేజీ కుంగిపోయింది. వందేళ్లు ఉండాల్సిన బ్యారేజీని.. కేవలం మూడేళ్లలోనే కుప్పకూలిపోయే స్థితికి తీసుకొచ్చారు’’ అని ఉత్తమ్‌ మండిపడ్డారు. కుంగిపోయిన బ్యారేజీ, పియర్‌ 20 కింద నుంచి పైవరకు ఏర్పడిన పగుళ్లను ప్రజంటేషన్‌ ద్వారా మంత్రి వివరించారు.

‘‘గత ప్రభుత్వ నిర్వాకం, అవినీతి కారణంగా మేడిగడ్డి ఈ స్థితిలో ఉంది. రూ.1800 కోట్లతో టెండర్లు పిలిచారు. ఆ తర్వాత అంచనా వ్యయం పెంచుతూ రూ.4,500 కోట్లకు తీసుకెళ్లారు. అంటే.. ఎంత అవినీతి జరిగిందో అర్థమవుతోంది. స్వతంత్ర భారత దేశంలో ఈ తరహా అవినీతి జరగలేదు. ఇకపై జరగబోయేదీ లేదు. గత ఏడాది అక్టోబర్‌ 21న మేడిగడ్డ కుంగితే.. మేం అధికారంలోకి వచ్చే వరకు ఏ ఒక్కరోజు కూడా మాజీ సీఎం కేసీఆర్‌ ఈ విషయంపై స్పందించలేదు. ప్రాజెక్టులపై సలహాలు, సూచనలు ఇచ్చే అధికారం నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీకి (ఎన్‌డీఎస్‌ఏ) ఉంది. ప్రణాళిక, డిజైన్‌, పర్యవేక్షణ లోపం కారణంగానే మేడిగడ్డ డ్యామేజ్‌ అయిందని ఎన్‌డీఎస్‌ఏ నివేదికలో స్పష్టంగా చెప్పింది. అన్నారం బ్యారేజీకి ఈ తరహా ప్రమాదం పొంచి ఉందని నివేదికలో తెలిపింది’’ అని ఉత్తమ్‌ అన్నారు.

గుత్తేదారులకు రూ.వేల కోట్లు లబ్ధి చేకూర్చారు

‘‘గత ప్రభుత్వం చేసిన ప్రతి రూపాయికి వచ్చే ప్రయోజనం 52 పైసలే. గుత్తేదారులకు రూ.వేల కోట్లు లబ్ధి చేకూర్చినట్లు కాగ్‌ నివేదికలో చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అన్ని పంపులు పనిచేస్తే రోజుకు 203 మిలియన్‌ యూనిట్లు విద్యుత్‌ వినియోగం అవుతుంది. రాష్ట్రంలో అన్ని రంగాల ఒకరోజు విద్యుత్‌ వినియోగం కేవలం 196 మిలియన్‌ యూనిట్లు మాత్రమే. కాళేశ్వరం విద్యుత్‌ ఛార్జీలు ఏడాదికి రూ.10,374 కోట్లు. ఎలాంటి సర్వే నిర్వహించకుండా మల్లన్న సాగర్‌ నిర్మించారు. చిన్నపాటి ప్రకంపనలు వచ్చినా ప్రమాదంలో పడుతుంది. ఆ ప్రాజెక్టు పరిధిలో ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని కాగ్‌ తెలిపింది’’ అని ఉత్తమ్‌ వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని