Kishan Reddy: నిన్న 8.. నేడు 8.. రేపు 88..!

అసెంబ్లీ ఎన్నికల్లో 8, లోక్‌సభ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిచిన భాజపా.. 2028 శాసనసభ ఎన్నికల్లో 88 స్థానాలను కైవసం చేసుకుంటుందని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Published : 07 Jun 2024 06:23 IST

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాదే విజయం
మేం మరింతగా పనిచేయాలని ప్రజల సందేశం
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో 8, లోక్‌సభ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిచిన భాజపా.. 2028 శాసనసభ ఎన్నికల్లో 88 స్థానాలను కైవసం చేసుకుంటుందని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మరింత కష్టపడి పనిచేయాలని తమను ప్రజలు ఆదేశించినట్లు ఫలితాలు చెబుతున్నాయని, వారి ఆదేశం ప్రకారం పూర్తిస్థాయిలో పనిచేసి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో 46 అసెంబ్లీ స్థానాల పరిధిలో సంపూర్ణ ఆధిక్యాన్ని సాధించిన తాము.. వచ్చే ఎన్నికల నాటికి దీన్ని రెట్టింపు చేసుకోవడానికి ప్రయత్నిస్తామన్నారు. గురువారం దిల్లీలోని తన నివాసంలో కిషన్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికలు తన పరిపాలనకు రెఫరండం అన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పార్టీ కాంగ్రెస్‌కి 1% ఓట్లు పెరిగితే, భాజపాకు అసెంబ్లీ ఎన్నికల కంటే 21% ఓట్లు పెరిగాయని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం హామీలు అమలు చేయలేకపోవడంతో ఆరు నెలల్లోనే ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుందని విమర్శించారు. 

సంక్షేమం, అభివృద్ధి ఫలితాలివి..

‘ఉమ్మడి రాష్ట్రంలో కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత కానీ భాజపా ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున ఓట్లు, సీట్లు సాధించిన దాఖలా లేదు. 8 పార్లమెంటు స్థానాలు గెలవడం భాజపా, మోదీలపై ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనం. ఆరు నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 14% ఓట్లతో 8 స్థానాల్లో భాజపాను గెలిపించిన తెలంగాణ ప్రజలు.. లోక్‌సభ ఎన్నికల్లో 35% ఓట్లతో 8 పార్లమెంటు సీట్లతో ఆశీర్వదించారు. తెలంగాణ సెంటిమెంట్‌తో పదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన భారాస ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఆ పార్టీ 14 ఎంపీ సీట్లలో మూడో స్థానానికి పరిమితమైంది. కాంగ్రెస్‌కు గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన సెగ్మెంట్లలో కూడా ఓటింగ్‌ తగ్గింది. అనేక స్థానాల్లో భాజపా బలం పెరిగింది. గత పదేళ్లలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేసింది. అందుకు ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది’ అని కిషన్‌రెడ్డి తెలిపారు. 

భాజపాయే ప్రత్యామ్నాయం 

‘ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం మహబూబ్‌నగర్‌తోపాటు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత స్థానం మెదక్‌లలో ఆ రెండు పార్టీలు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా భాజపా విజయం సాధించడం తెలంగాణ భవిష్యత్తు రాజకీయాలకు సూచిక. భారాస బలహీనపడడం, కాంగ్రెస్‌పై విపరీతమైన వ్యతిరేకత వల్ల ప్రత్యామ్నాయంగా భాజపా ఉండాలని ప్రజలే నిర్ణయించి ఆదరించినట్లు భావిస్తున్నాం’ అని కిషన్‌రెడ్డి వివరించారు. మీరు ప్రభుత్వంలో ఉంటారా? పార్టీ కోసం పనిచేస్తారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ ‘నేను ప్రభుత్వంలో ఉన్నా.. లేకున్నా పార్టీ కోసం పనిచేస్తా’ అన్నారు. మీరు భాజపా జాతీయ అధ్యక్షుడు అవుతారన్న ప్రచారం జరుగుతోంది కదా? అని ప్రశ్నించినప్పుడు ‘నా మీద మీకు ఏమైనా కోపం ఉందా?’ అని నవ్వుతూ విలేకరులకు ఎదురుప్రశ్న వేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా, జనసేన, భాజపాల కూటమి బ్రహ్మాండమైన విజయం సాధించడంపై పూర్తి హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. మూడు పార్టీలకు అభినందనలు, ఏపీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని