Revanth Reddy: దిల్లీకి సీఎం రేవంత్‌.. నేటి సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరు

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం రాత్రి దిల్లీ వెళ్లారు.

Updated : 08 Jun 2024 05:18 IST

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం రాత్రి దిల్లీ వెళ్లారు. శనివారం జరిగే ఈ సమావేశంలో సీఎంతో పాటు సభ్యురాలిగా దీపా దాస్‌మున్షీ, ప్రత్యేక ఆహ్వానితునిగా వంశీచంద్‌రెడ్డి, శాశ్వత ఆహ్వానితునిగా మంత్రి దామోదర్‌ రాజనర్సింహ కూడా పాల్గొంటారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌.. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై దిల్లీలో పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. నామినేటెడ్‌ పోస్టుల భర్తీ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక తదితర అంశాలు కూడా చర్చకు వస్తాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇండియా కూటమి పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్‌గా రాహుల్‌ గాంధీని ఎన్నుకోవడంతో రేవంత్‌రెడ్డి ఆయనను కలిసి అభినందించనున్నారు. సీఎం శనివారం రాత్రి గానీ, ఆదివారం ఉదయం గానీ తిరిగి రాష్ట్రానికి వచ్చే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

పార్లమెంటరీ పార్టీ సమావేశానికి కాంగ్రెస్‌ కొత్త ఎంపీలు 

లోక్‌సభకు నూతనంగా ఎన్నికైన ఎనిమిది మంది రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీలు శనివారం దిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం అక్కడ జరగనున్న కాంగ్రెస్‌ పార్లమెంటరీ పక్ష సమావేశానికి వారు హాజరవుతారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వారిని పార్టీ అధిష్ఠానానికి పరిచయం చేయనున్నారు. రాష్ట్రం నుంచి బలరాం నాయక్‌ (మహబూబాబాద్‌), సురేశ్‌ షెట్కార్‌ (జహీరాబాద్‌), మల్లు రవి (నాగర్‌కర్నూల్‌), రఘురాంరెడ్డి (ఖమ్మం), చామల కిరణ్‌కుమార్‌రెడ్డి (భువనగిరి), కుందూరు రఘువీర్‌ (నల్గొండ), కడియం కావ్య (వరంగల్‌), గడ్డం వంశీకృష్ణ (పెద్దపల్లి) ఎంపీలుగా గెలిచిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు