Revanth Reddy: కాబోయే ప్రధాని రాహుల్‌ గాంధీనే: సీఎం రేవంత్‌రెడ్డి

కేరళలోని వయనాడులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, భాజపాపై విమర్శలు గుప్పించారు. 

Published : 18 Apr 2024 00:02 IST

వయనాడ్‌: కాబోయే ప్రధాని రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)నే అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. రాబోయే 20 ఏళ్లు ఆయనే భారత ప్రధానిగా ఉంటారని రేవంత్‌ పేర్కొన్నారు. కేరళ (Kerala)లోని వయనాడ్‌ (Wayanad)లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లుగా వారణాసి ఎంపీ దేశానికి ప్రధానిగా ఉన్నారని.. రాబోయే 20 ఏళ్లు వయనాడ్ ఎంపీ ప్రధానిగా ఉంటారని ఇక్కడి ​ప్రజలకు తాను భరోసా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ పారదర్శకత కోసమే తెచ్చామని మోదీ చెబుతున్నారని, అదే నిజమైతే ఈ వ్యవస్థను సుప్రీంకోర్టు ఎందుకు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించిందని ప్రశ్నించారు. పారదర్శకత ఉంటే ఎలక్టోరల్ బాండ్స్ కొన్న వారిని, ముఖ్యంగా భాజపాకి డబ్బులు ఇచ్చిన వారి పేర్లను ఎందుకు బయటపెట్టడం లేదని నిలదీశారు. బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలంటే ప్రధాని నరేంద్ర మోదీ భయపడుతున్నారని, ఈవీఎంలపై విపక్షాలతోపాటు, ప్రజలకు నమ్మకం పోయిందన్నారు.

‘‘ప్రపంచవ్యాప్తంగా పోలింగ్‌కు బ్యాలెట్ పేపర్లు ఉపయోగిస్తుంటే.. మనదేశంలో మాత్రం ఈవీఎంలను ఉపయోగిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఓటు అడిగే కనీస హక్కు భాజపాకి గానీ, ప్రధాని మోదీకి గానీ లేదు. దక్షిణాదికి ఏమిచ్చారని ఇక్కడి ప్రజలు ఓటు వేయాలి? అబ్ కీ బార్ 400 పార్ అనే స్లోగన్ వినడానికి బాగానే ఉన్నప్పటికీ.. ఆ పార్టీకి అన్ని సీట్లు రావు. 10 సంవత్సరాల పాలనలో దేశాన్ని మోదీ భ్రష్టు పట్టించారు. దక్షిణాది రాష్ట్రాలు కూడా భారత్‌లో అంతర్భాగమే అని గ్రహించాలి. ఈ మధ్యకాలంలో మోదీ ఎందుకు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు?గుజరాత్‌కు కేటాయించిన బుల్లెట్ రైలును దక్షిణాదికి కూడా ఇస్తామని ఇప్పుడే ఎందుకు మేనిఫెస్టోలో పెట్టారు? రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, హోం మంత్రి, రక్షణ శాఖ మంత్రి.. ఇలాంటి కీలక పదవుల్లో దక్షిణాదికి చెందిన వారిని ఎంపిక చేశారా? దక్షిణాది రాష్ట్రాలు భాజపాను ఎప్పుడో నిషేధించాయి’’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని