Congress: ఇంకా ఎక్కువ సీట్లు ఎందుకు రాలేదు?

శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన ఎంపీ సీట్లు రాకపోవడం రాష్ట్ర కాంగ్రెస్‌లో చర్చనీయాంశమైంది.

Published : 07 Jun 2024 03:05 IST

లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌లో అంతర్మథనం
భారాస ఓట్లను పూర్తిగా ఆకర్షించలేకపోవడంపై చర్చ

ఈనాడు, హైదరాబాద్‌: శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన ఎంపీ సీట్లు రాకపోవడం రాష్ట్ర కాంగ్రెస్‌లో చర్చనీయాంశమైంది. అత్యధిక సీట్లతో భాజపాపై ఆధిక్యాన్ని సాధించలేకపోవడానికి కారణాలపై ఆరా తీస్తున్నారు. ఎమ్మెల్యేలు గెలిచి లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లను పొందడంలో రెండో స్థానానికి పడిపోయిన నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలిసింది. ముందు నుంచీ పార్టీలో ఉన్న వారికి, కొత్తగా వచ్చిన వారికి మధ్య సమన్వయం లేకపోవడం, అభ్యర్థుల ఎంపికలో జాప్యం, కొన్ని స్థానాలకు ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకొని టికెట్లు ఇవ్వడం తదితరాలు దీనికి కారణం కావచ్చనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, మెదక్, సికింద్రాబాద్, నిజామాబాద్‌ స్థానాలపై కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకొంది. ఇందులో కనీసం రెండు గ్యారంటీగా వస్తాయనుకున్నా... అన్నీ భాజపా ఖాతాలో చేరాయి. భారాస ఓటు బ్యాంకు గణనీయంగా తగ్గి భాజపా వైపు మొగ్గు చూపడం, కొంత కాంగ్రెస్‌కు మళ్లినా... కొన్నిచోట్ల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లలో కూడా కొంత శాతం భాజపా వైపు మొగ్గు చూపడం తదితర కారణాలు కనిపిస్తున్నాయి. నాయకుల మధ్య సమన్వయలోపం కూడా సమస్య తెచ్చి పెట్టిందన్న అభిప్రాయముంది. 

  • అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్‌ లోక్‌సభ పరిధిలోని ఏడు ఎమ్మెల్యే స్థానాల్లో ఒకటి మాత్రమే కాంగ్రెస్‌ గెలిచింది. ఇలాంటి చోట తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన, మానవ హక్కుల ఉద్యమంలో చురుగ్గా పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణను పోటీలో దింపి ప్రయోగం చేసింది. మంత్రి సీతక్క పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు. పైగా సుగుణకు ఉన్న క్లీన్‌ ఇమేజీ కలిసొస్తుందని భావించింది. నిర్మల్, ముథోల్‌లలో భాజపా ఎమ్మెల్యేలు ఉండటం, ఇక్కడ కాంగ్రెస్‌కు అసెంబ్లీ ఎన్నికల్లోనూ తక్కువ ఓట్లు రావడంతో నిర్మల్‌ నుంచి మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని, ముథోల్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డిని పార్టీలో చేర్చుకొంది. అయితే గత ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్‌ నాయకులకు, కొత్తగా చేరిన వారికి మధ్య సమన్వయం లేకపోవడం ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలో ఖానాపూర్‌లో మాత్రమే కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఉండగా, లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు ఆధిక్యం వచ్చింది. ఆదిలాబాద్‌లాంటి చోట నాయకుల మధ్య విబేధాలు కొనసాగాయి. 
  • మెదక్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఒకచోట మాత్రమే కాంగ్రెస్‌ గెలిచింది. ఇక్కడ కాంగ్రెస్‌ గట్టిగా ప్రయత్నించి... నువ్వానేనా అనే స్థితికి వచ్చింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ మంత్రి దామోదర్‌ రాజనరసింహ జహీరాబాద్‌ ఇన్‌ఛార్జిగా ఉన్నారు. మెదక్‌ ఇన్‌ఛార్జిగా కొండా సురేఖ గట్టి ప్రయత్నం చేశారు. ఇక్కడ భారాస గట్టిగా పోటీలో నిలిచినందున కాంగ్రెస్‌కు విజయావకాశాలు ఉంటాయని భావించారు. అయితే పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయ లోపం, కొందరు సహకరించకపోవడంతో లక్ష్యాన్ని చేరుకోలేకపోయినట్లు కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ వచ్చిన మెదక్‌లో ఈసారి రాకపోగా, సంగారెడ్డి, నర్సాపూర్‌లో మొదటి స్థానం వచ్చింది. నర్సాపూర్‌ మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసింది. 
  • సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత జిల్లాలోని మహబూబ్‌నగర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. అభ్యర్థిని ముందుగా ప్రకటించడంతోపాటు ఎక్కువసార్లు పర్యటించారు. బహిరంగ సభలు, రోడ్‌షోలలో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో లోక్‌సభ స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్‌కు ఆధిక్యత వస్తే, ఇప్పుడు నాలుగింట్లో రెండోస్థానం రాగా, మిగిలిన చోట్ల మెజారిటీలు వచ్చాయి. ఎమ్మెల్యేలంతా గట్టిగానే పనిచేసినా... మిగిలిన వాళ్లు పూర్తి స్థాయిలో మమేకం కాకపోవడం ఓటమికి కారణంగా చెబుతున్నారు. ఇక్కడ అభ్యర్థి గతంలో ప్రాతినిథ్యం వహించిన అసెంబ్లీ నియోజకవర్గం కూడా నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానం పరిధిలో ఉంది. 
  • చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థిగా మొదట పట్నం సునీత వైపు మొగ్గు చూపినా రంజిత్‌రెడ్డి రావడంతో ఎవరు చేవెళ్ల, ఎవరు మల్కాజిగిరి అన్నదానిపైనే కొన్నాళ్లు గడిచిపోయాయి. చేవెళ్ల పరిధిలోని వికారాబాద్, తాండూరు తదితర నియోజకవర్గాల్లో పట్టున్న పట్నం సునీతను మల్కాజిగిరి లాంటి చోట పోటీకి నిలిపారు. మల్కాజిగిరిలో మరో బలమైన అభ్యర్థి లేకపోవడమే ఇందుకు కారణంగా కాంగ్రెస్‌ వర్గాలు చెప్తున్నాయి. చేవెళ్లలో భారాస సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న రంజిత్‌రెడ్డికి టికెట్‌ ఇస్తే గెలుపు అవకాశాలు ఉంటాయని భావించినా, కాంగ్రెస్‌ కార్యకర్తలు దీనిని మనస్ఫూర్తిగా అంగీకరించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
  • అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించి లోక్‌సభ ఎన్నికల్లో భారీగా ఓట్లు కోల్పోయిన నియోజకవర్గాల్లో కరీంనగర్‌ ఒకటి. శాసనసభ ఎన్నికలప్పుడు హుస్నాబాద్‌ టికెట్‌ ఇవ్వలేకపోవడంతో ఎంపీగా పోటీకి అవకాశమిస్తామని మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డికి కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. కానీ, అభ్యర్థిని చివరి వరకు తేల్చకపోగా, నామినేషన్‌ చివరి రోజున రాజేందర్‌రావును అభ్యర్థిగా ప్రకటించింది. మంత్రి పొన్నం ప్రభాకర్‌ కూడా ఈయన వైపు మొగ్గు చూపారు. అయితే అసెంబ్లీ ఎన్నికల కంటే 1.65 లక్షల ఓట్లు తక్కువ రావడంతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన చొప్పదండి, వేములవాడ, మానకొండూరులో చాలా తక్కువ ఓట్లు పడ్డాయి. 
  • నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని రంగంలోకి దింపడంతో జగిత్యాల, కోరుట్లలో ఎక్కువ ఓట్లు వస్తాయని భావించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన జగిత్యాలలో ఇప్పుడు నామమాత్రపు మెజారిటీ రాగా, కోరుట్లలో భాజపా అభ్యర్థికే భారీ మెజారిటీ దక్కింది. నిజామాబాద్‌ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో జీవన్‌రెడ్డికి పరిచయాలు తక్కువ. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచిన నిజామాబాద్‌ రూరల్‌లో ఇప్పుడు భాజపాకు భారీ ఆధిక్యత లభించింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని