Ts Assembly: రాష్ట్రం పురోభివృద్ధి దెబ్బతినేలా మాట్లాడటం సరికాదు: కేటీఆర్‌

తెలంగాణలో ప్రోత్సాహకాలు పారదర్శకంగా ఉన్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఐటీ, పరిశ్రమలపై జరిగిన స్వల్పకాలిక చర్చలో భాగంగా

Published : 28 Sep 2021 01:25 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ప్రోత్సాహకాలు పారదర్శకంగా ఉన్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఐటీ, పరిశ్రమలపై జరిగిన స్వల్పకాలిక చర్చలో భాగంగా లేవనెత్తిన అంశాలకు కేటీఆర్‌ సమాధానం చెప్పారు. గతంలో నీకెంత.. నాకెంత అనే విధంగా వ్యవహారాలు ఉండేవన్నారు. 17 వేలకుపైగా పరిశ్రమలకు ఆకర్షించగలిగామని.. కార్ల పరిశ్రమల కోసం ఇతర దేశాలతో పోటీ పడాలన్నారు. కట్టుకథలతో పరిశ్రమలు రావని.. కఠోర శ్రమతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి పేరు వస్తుందేమో అని రాష్ట్రాన్ని నిందిస్తున్నారని ఆక్షేపించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. రాష్ట్రం మాత్రమే శాశ్వతం అన్నారు. రాష్ట్రం పురోభివృద్ధి దెబ్బతినేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.

‘‘తెరాస మరో 20 ఏళ్లు అధికారంలో కొనసాగుతుంది. సమ్మిళిత అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాం. సీఎం దృష్టికోణం ఎప్పుడూ దూరదృష్టితో ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌గా ముచ్చర్ల అవతరించబోతోంది. మన పిల్లలకు కార్పొరేట్‌ కంపెనీలో ఉద్యోగాలు కోరుతున్నాం. కార్పొరేట్‌ కంపెనీల కోసం భూసేకరణ చేయాల్సి ఉంది. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాల గురించి ఆలోచించాలి. ప్రజలు చాలా తెలివైనవారు. తప్పకుండా అందరి జాతకాలు రాస్తారు. పరిశ్రమలు ఒకేచోటు ఉంటే ఉత్పత్తి ఖర్చు తగ్గించుకోవచ్చు. ఉమ్మడి ఏపీలో 35 ఏళ్లలో 23 వేల ఎకరాల్లో పారిశ్రామిక పార్కులు అభివృద్ధి చేశారు. టీఎస్‌ఐఐసీ ఏర్పాటయ్యాక ఆరేళ్లలో 19వేలకుపైగా పారిశ్రామిక పార్కులు అభివృద్ధి చేశాం. ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ రంగాన్ని విస్తరిస్తాం. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో 50 వేల ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతి పరిశ్రమకు గమ్యస్థానం తెలంగాణే’’ అని కేటీఆర్‌ అన్నారు.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts