BJP: అసెంబ్లీలకి ఎన్నికైన.. 10 మంది భాజపా ఎంపీల రాజీనామా

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో అధికారం దక్కించుకున్న భాజపా సీఎంలను ఎంపిక చేసే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నుంచి అసెంబ్లీలో బరిలో దిగి గెలిచిన పలువురు ఎంపీలు తమ పార్లమెంట్‌ సభ్యత్వాలకు రాజీనామా చేశారు.

Updated : 06 Dec 2023 20:21 IST

Assembly Election Results | దిల్లీ: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో భాజపా(BJP) విజయ దుందుభి మోగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కమలనాథులు ముమ్మరం చేశారు. మరోవైపు, అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి గెలుపొందిన పలువురు ఎంపీలు తమ పార్లమెంటు సభ్యత్వాలకు రాజీనామా చేశారు. వీరిలో ఇద్దరు కేంద్రమంత్రులతో పాటు మొత్తం పది మంది భాజపా ఎంపీలు ఉన్నారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ శాసనసభలకు ఎన్నికల్లో గెలుపు వ్యూహంలో భాగంగా భాజపా పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలను బరిలోకి దించి అద్భుతమైన ఫలితాలు సాధించింది. అనుకున్న విజయం సొంతం కావడంతో ఈ మూడు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను ఎంపిక చేసే ప్రక్రియను ముమ్మరం చేసింది.

రేవంత్‌ ప్రమాణస్వీకారం.. కేసీఆర్‌, చంద్రబాబు సహా ముఖ్యనేతలకు ఆహ్వానాలు

అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 12 మంది ఎంపీలలో పది మంది తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన అనంతరం తమ రాజీనామా లేఖలను లోక్‌సభ స్పీకర్‌కు అందజేశారు. ఆ సమయంలో వారితో పాటు జేపీ నడ్డా సైతం స్పీకర్‌ వద్దకు వెళ్లారు. స్పీకర్‌ను కలిసి రాజీనామాలు అందజేసిన వారిలో మధ్యప్రదేశ్‌ నుంచి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌,  కేంద్ర జల్‌శక్తి సహాయ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌తో పాటు రితి పాఠక్‌, రాకేశ్‌ సింగ్‌, ఉదయ్‌ ప్రతాప్‌ సింగ్‌; రాజస్థాన్‌ నుంచి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌, దియా కుమారి; ఛత్తీస్‌గఢ్‌ నుంచి అరుణ్ సావో, గోమతి సాయి ఉన్నారు. వీరితో పాటు రాజ్యసభ ఎంపీ  కిరోరిలాల్‌ మీనా కూడా తన రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్‌కు అందజేశారు. ఇదిలా ఉండగా..  కేంద్రమంత్రి  రేణుకా సింగ్‌, మహంత్‌ బాలక్‌నాథ్‌ తమ ఎంపీ పదవులకు రాజీనామా చేయనున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని