తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. ఒంటిపై పెట్రోల్ పోసుకున్న పులివర్తి నాని

తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Updated : 08 Jan 2024 18:14 IST

తిరుపతి: తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రగిరిలో నమోదైన నకిలీ ఓట్లు తొలగించాలని తిరుపతి గ్రామీణం ఆర్డీవో కార్యాలయం వద్ద తెదేపా నేతలు సోమవారం ధర్నాకు దిగారు. వారికి పోటీగా అధికార వైకాపా నేతలు దళితులతో కలిసి అక్కడే నిరసన వ్యక్తం చేసేందుకు వచ్చారు. ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

రాజ్యాంగానికి విరుద్ధంగా చంద్రగిరి నియోజకవర్గం ఓటర్ల జాబితా రూపకల్పనలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ తెదేపా నేతలు సోమవారం ఉదయం నుంచి ఆర్డీవో కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో పలువురు వైకాపా కార్యకర్తలు.. దళితులకు ఓటు హక్కు కల్పించాలంటూ అక్కడకు చేరుకొని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఒకేసారి రెండు పార్టీలకు చెందిన నేతలు నిరసనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెదేపా, వైకాపా నేతలను అరెస్టు చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అరెస్టు చేశారు.

పోలీసుల అరెస్టును నిరసిస్తూ.. చంద్రగిరి తెదేపా బాధ్యులు పులివర్తి నాని ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే స్పందించిన పోలీసులు దీక్షను భగ్నం చేసేందుకు యత్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆర్డీవో స్పందించి బోగస్ ఓట్లను రద్దు చేసేంత వరకు దీక్ష విరమించబోయేది లేదు. ఓటర్ల జాబితాపై ఇంత నిర్లక్ష్యమా? గత 7 నెలలుగా పోరాడుతున్నా పట్టించుకోవడం లేదు. వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సూచనలతోనే భారీగా బోగస్ ఓట్లు నమోదవుతున్నాయి. ఆధారాలు సమర్పించి చర్యలు తీసుకోండని కోరుతున్నా స్పందించడం లేదు. ఓటమి భయంతోనే చెవిరెడ్డి దొంగ ఓట్లు సృష్టిస్తున్నారు. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు. ఓట్లతోనే వైకాపాకు బుద్ధి చెబుతారు’’ అని మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు